వెలిగిన చోటే పిడుగులు.. చరిత్ర చెప్పేది ఇదే!
అందుకు ఎంత తోపు నేత సైతం మినహాయింపు కాదు. తాజా పరిణామాల్ని చూసినప్పుడు.. చరిత్రను కాస్త లింకు చేసుకుంటే విషయం ఇట్టే అర్థమైపోతుంది
రాజకీయాలు భలే సిత్రంగా ఉంటాయి. దేన్ని అయినా మార్చే శక్తి కాలానికి మాత్రమే ఉంటుంది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన చోటే.. తర్వాతి కాలంలో అనూహ్య పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకు ఎంత తోపు నేత సైతం మినహాయింపు కాదు. తాజా పరిణామాల్ని చూసినప్పుడు.. చరిత్రను కాస్త లింకు చేసుకుంటే విషయం ఇట్టే అర్థమైపోతుంది. గతంలో తాము ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహించి మెరుపులు మెరిపించామో.. తర్వాతి కాలంలో అదే పార్టీ కారణంగా వేధింపులకు గురి కావటం.. కేసులతో జైలు జీవితాన్ని గడపాల్సి రావటం కనిపిస్తుంది.
తాజాగా చంద్రబాబు అరెస్టు వ్యవహారాన్ని చూస్తే.. కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వం. అయినప్పటికీ ఆయనకు జైలు తప్ప లేదు. దశాబ్దాల క్రితం ఇదే ఎన్డీయే కూటమికి కన్వీనర్ గా ఉన్న చంద్రబాబు.. అప్పట్లో ఒక వెలుగు వెలిగారు. వాజ్ పేయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశ రాజకీయాల్లో చంద్రబాబు ఎంతలా చక్రం తిప్పారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి చంద్రబాబు.. ఈ రోజు మోడీ కేంద్రంగా సాగే ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న వేళలో జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. రోజుల తరబడి బెయిల్ కోసం ఫైట్ చేస్తూ.. కాలం గడుపుతున్నారు.
నిజానికి ఇలాంటి ఉదంతం ఒక్క చంద్రబాబుకు మాత్రమే పరిమితం కాదు. ప్రస్తుతం ఏపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలోనూ కనిపిస్తుంది. ఆయన తండ్రి కాంగ్రెస్ పార్టీలో ఎంతలా వెలిగారో తెలిసిందే. ఆయన కోరుకున్నంతనే పార్టీ అధినాయకత్వం వెంటనే అపాయింట్ మెంట్ ఇవ్వటమే కాదు.. ఆయన అభిప్రాయాలకు పెద్ద పీట వేసేవారు.
ఒక విదంగా చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చిందంటే అందుకు కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నది నిజం. అలాంటి నాయకుడు కొడుకు మీద కక్ష సాధింపు చర్యలతో తర్వాతికాలంలో జైలుకు పరిమితం చేయటం కాంగ్రెస్ పార్టీకే చెల్లిందే. యూపీఏ సర్కారు అధికారంలో ఉన్న వేళలోనే ఆయన జైలుకు వెళ్లటమే కాదు.. నెలల తరబడి జైల్లోనే ఉండాల్సి వచ్చింది.
అంతేనా.. కనిమొళి సంగతే చూసుకుంటే ఇలాంటివి మరెన్నో విషయం అర్థమవుతుంది. కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్న వేళలో.. డీఎంకే ఎంపీల మద్దతు ఎంత కీలకమో తెలిసిందే. అయినప్పటికీ ఆ పార్టీ అధినేత గారాలపట్టి కనిమొళికి మాత్రం జైలు జీవితం తప్పలేదు. 2జీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొన్న కనిమొళి అరెస్టు కావటం.. జైల్లో ఉండాల్సి రావటం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళలోనే కావటం చూస్తే.. ఒక పార్టీ పవర్లోకి రావటానికి కీలకంగా వ్యవహరించారో.. తర్వాతి కాలంలో అదే పార్టీ అధికారంలో ఉన్న వేళలో అరెస్టు కావటం కనిపిస్తుంది. ఈ విషయంలో చంద్రబాబు.. జగన్.. కనిమొళి తదితరులకు ఒకేలాంటి అనుభవం ఎదురైందని చెప్పక తప్పదు.