పొత్తులు సరే.. ఏపీకి ఏమిస్తారు.. ట్రెండింగ్?
ఇంత వరకుబాగానే ఉంది. అయితే.. ఏపీకి ఏమిస్తారు? అనేది ఇప్పుడు.. నెటిజన్ల నుంచి షార్ప్‌గా దూసుకువస్తున్న ప్రశ్న
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు, అభివృద్ధి దిశగా ఏపీని ముందుకు నడిపించేందుకు బీజేపీతో పొత్తులు పెట్టుకున్నా మని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఇక, ఇదే విషయంపై బీజేపీ అగ్రనేత, పార్టీ చీఫ్ జేపీ నడ్డా కూడా స్పందించారు. టీడీపీ, జనసేనలతో కలిసి బీజేపీ ఎన్నికలకు వెళ్తుందని చెప్పారు. అంతేకాదు.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకు ఇదొక ప్రత్యామ్నాయ మార్గమని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అంటే.. మొత్తానికి పార్టీల ప్రయోజనాల కన్నా.. ప్రజలు, ఏపీ అభివృద్ధి లక్ష్యంగా ఈ పార్టీలు ముందుకు సాగాలని నిర్నయించుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.
ఇంత వరకుబాగానే ఉంది. అయితే.. ఏపీకి ఏమిస్తారు? అనేది ఇప్పుడు.. నెటిజన్ల నుంచి షార్ప్‌గా దూసుకువస్తున్న ప్రశ్న. ఏపీలో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయం కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని ఇంకా లైవ్‌లోనే ఉంది. ఇక, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, కడప ఉక్కు నిర్మాణం, వెనుకబడిన జిల్లాలకు నిధులు, పోలవరం నిర్మాణం పూర్తి, మరీ ముఖ్యమైన రాజధాని అమరావతి నిర్మాణం.. వంటివి ప్రధానంగా ప్రజల కళ్ల ముందు కదలాడుతున్నాయి. వీటిని ఈ మిత్రపక్షాలు చర్చిస్తాయా? అనేది కీలక సందేహం.
ఎందుకంటే.. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం అనేక సందర్భాల్లో ప్రత్యేక హోదాను పట్టించుకునేది లేదని స్పష్టం చేసింది. ఇక, విశాఖ ఉక్కును ఏదో ఒక రోజు అమ్మేయడం కూడా ఖాయమేనని పార్లమెంటులోనే అనేక సందర్భాల్లో వెల్లడించింది. పోలవరం నిధుల మాట.. నిర్మాణ పరిస్థితి కూడా ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా సమస్యలపైనే గతంలో చంద్రబాబు బీజేపీతో విభేదించి బయటకు వచ్చారు. ఇప్పుడు అనూహ్యంగా ఆ పార్టీతో మరోసారి చేతులు కలిపారు. ఈ క్రమంలో నెటిజన్లు.. ఆసక్తిగా స్పందిస్తున్నారు. మీరు మీరు కలిశారు.. మరి ఏపీకి ఏంటి? ఏం చెబుతారు? అనే విషయాలపై ఆసక్తిగా ప్రశ్నలు సంధిస్తున్నారు.