ఫేస్ బుక్ లైవ్ లోనే ముంబైలో పొలిటీషియన్ కాల్చివేత... వీడియో వైరల్!
ఆ వ్యక్తి అతి సమీపం నుంచే కాల్పులు జరపడంతో అభిషేక్ ఘోసల్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
మహారాష్ట్ర రాజధాని ముంబై లో ఒక పొలిటీషియన్ ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా అతనిపై ఒక వ్యక్తి తుపాకీతో రెండు మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అలా చికిత్స అందిస్తున్న సమయంలోనే సదరు నాయకుడు మృతి చెందాడు. ఇప్పుడు ఈ విషయం మహారాష్ట్రలోనే కాకుండా.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
అవును... మహారాష్ట్ర రాజధాని ముంబైలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఇందులో భాగంగా... "ఉద్ధవ్ థాక్రే శివసేన" పార్టీ నాయకుడు వినోద్ ఘోసల్కర్ కుమారుడు అభిషేక్ ఘోసల్కర్ పై మౌరిస్ భాయ్ అనే దుండుగుడు కాల్పులు జరిపాడు. ఆ వ్యక్తి అతి సమీపం నుంచే కాల్పులు జరపడంతో అభిషేక్ ఘోసల్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఒక్కసారిగా ముంబై ఉలిక్కిపడింది.
అభిషేక్ ఘోసల్కర్ ఫేస్ బుక్ లైవ్ లో ముగుస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తుంది. అభిషేక్ చైర్ లో నుంచి లేచీ లేవగానే దుండగుడు ముందుగా పొట్టభాగంలో ఒక రౌండ్ కాల్పులు జరపగా.. షాక్ నుంచి తేరుకునేలోపు మరుసటి క్షణంలో కాల్చిన మరో రౌడ్ అభిషేక్ భుజానికి తగిలినట్లు కనిపిస్తుంది. తర్వాత మరో రౌండ్ సౌండ్ వచ్చినప్పటికీ.. అది వీడియోలో రికార్డ్ కాలేదు!!
ఈ నేపథ్యంలో వెంటనే అభిషేక్ ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి తరలించిన కాసేపటికే అతడు ప్రాణాలు కోల్పోయారని వైద్యులు తెలిపారు. మరోవైపు, అభిషేక్ పై కాల్పులు జరిపినట్లు చెబుతున్న నిందితుడు మౌరిస్ భాయ్ కూడా తనను తాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో... మహారాష్ట్రలో శాంతిభద్రతల అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.
ఉద్ధవ్ ఠాక్రేకు సన్నిహితుడిగా భావించే మాజీ ఎమ్మెల్యే వినోద్ ఘోసల్కర్ కుమారుడైన అభిషేక్... ప్రస్తుతం కౌన్సిలర్ గా ఉన్నారు. వినోద్ మాత్రం ముంబై బిల్డింగ్ రిపేర్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ బోర్డు ఛైర్మన్ గా ఉన్నారు. కాగా, అభిషేక్ కి మౌరిస్ భాయ్ తో శత్రుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఇటీవల కాలంలో వీరిద్దరిమధ్య రాజీ కుదిరిందని అంటున్నారు.