రంగు పడుద్దీ...నాడు వైసీపీ నేడు టీడీపీ !
వాటికి పార్టీ రంగులు అద్దడం జెండాలు పాతి తమ అజెండాలను ప్రచారం చేసుకోవడం అలవాటు గా మారింది.
ఏపీలో రంగుల రాజకీయానికి మరో మారు తెర లేచింది. రాజకీయ పార్టీలు అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఆస్తులను తమ సొంత ఆస్తులు గా భావించడం సాధారణం అయిపోయింది. వాటికి పార్టీ రంగులు అద్దడం జెండాలు పాతి తమ అజెండాలను ప్రచారం చేసుకోవడం అలవాటు గా మారింది.
ఇది వారూ వీరూ అందరూ అమలు చేస్తున్న ఫక్తు రాజకీయ నీతిగా మారిపోయింది. విభజన ఏపీలో 2014 నుంచి 2019 దాకా పాలించిన టీడీపీ ఈ రంగుల రాజకీయానికి మొదట తెర తీసింది. అప్పట్లోనే అన్న క్యాంటీన్లకు పసుపు రంగు పూసింది. అంతే కాదు రేషన్ కార్డులకు అదే రంగు పూసింది. ఇక ఏ ప్రభుత్వ పధకం అయినా కార్యక్రమం అయినా ఆఖరుకు సంక్రాంతికి ఇచ్చే కానుకకు అయినా పసుపు రంగులు అద్దేవారు.
ఇలా పసుపు ధనం తో టీడీపీ పరవశిస్తే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సైతం అదే బాటన నడచింది. వారు చేస్తే తప్పు కానిది తాము ఎందుకు చేయకూడదు అని భావించి ఈ విషయంలో తాము నాలుగు ఆకులు ఎక్కువ చదివినట్లుగా నిరూపించుకుంది. దాంతో వైసీపీ హయాంలో రంగుల హంగులకు హద్దే లేకుండా పోయింది. ఆఖరుకు శ్మశాన వాటికలకు సైతం పార్టీ రంగులు అద్దేసి అభాసుపాలు అయ్యారు.
ఈ సందర్భంగా ఆనాటి విపక్ష నేత మాజీ సీఎం చంద్రబాబు అన్న మాటలు ఇపుడు వీడియోల రూపంలో వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం సొమ్ముతో కట్టిన భవనాలకు పార్టీ రంగులు ఏంటిది. ఇది ఏమైనా వీరి అబ్బ సొత్తా అని వైసీపీ నేతలను బాబు ఆగ్రహంగా ప్రశ్నించడాన్ని ఇపుడు వైసీపీ తిరిగి వైరల్ చేస్తోంది. ఎందుకు అంటే ఇపుడు టీడీపీ కూడా అదే పని చేస్తోంది. వందల కోట్లతో ప్రభుత్వం ఖర్చుతో నిర్మిస్తున్న అన్న క్యాంటీన్లకు పూర్తిగా పసుపు రంగు పూసేశారు. వాటి మీద ఎరుపు రంగుతో అన్న క్యాంటీన్ల పేరు రాసేశారు.
వాటిని అలా చూసిన వారికి టీడీపీ జెండా రంగులే కనిపిస్తాయి. ఇక ఇది చాలదు అన్నట్లుగా అన్న గారి ఫోటో చంద్రబాబు ఫోటో పెట్టేసారు. దీంతో వైసీపీకి నీతులు చెప్పిన టీడీపీ ఇపుడు చేస్తోంది ఏమిటి అన్న చర్చ సాగుతోంది. ఈ రంగుల పిచ్చి ఏమిటి అని కూడా సగటు జనాలు అనుకునేలా ఇదంతా సాగుతోంది.
దీని మీద మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు అయితే ఘాటైన విమర్శలు చేశారు. ప్రభుత్వ సొమ్ముతో అన్న క్యాంటిన్లను నిర్మించారని, వాటికి పసుపు రంగు ఎందుకు వేశారో చెప్పాలంటూ చంద్రబాబును అంబటి రాంబాబు నిలదీశారు.
అన్న క్యాంటీన్ల పేరుతో అవినీతికి తెర తీశారు అని ఆయన విమర్శించారు. అన్న క్యాంటిన్లను రద్దీ ప్రదేశాల్లో పెట్టాలని, కానీ ఊరికి దూరంగా నిర్మించడమేంటని అంబటి రాంబాబు ప్రశ్నించారు. రెండు మూడు వందల మందికి భోజనాలు పెట్టి జనసంచారం లేనిచోట్ల వాటిని నిర్మించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
అంతే కాదు తాము ఎపుడూ అన్న క్యాంటిన్లను వ్యతిరేకించలేదని అంబటి కొత్త మాట చెప్పారు. అదే సమయంలో అందులో జరిగిన అవినీతిని తాము ప్రశ్నిస్తున్నామని అంటున్నారు. దీంతో అన్న క్యాంటీన్లు ఇపుడు రాజకీయ వివాదానికి కేంద్రంగా మారుతున్నాయి.
ఇక కూటమిలోని ప్రధాన భాగస్వామిగా ఉన్న జనసేన నేతలు సైతం పసుపు రంగులతో అన్న క్యాంటీన్లు ఉండడాం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయని అంటున్నారు. పిఠాపురంలో అయితే జనసైనికులు పవన్ పేరుని అన్న క్యాంటీన్లకు పెట్టాలని డిమాండ్ కూడా చేశారు.
ఇవన్నీ పక్కన పెడితే ఈ రంగుల పిచ్చి ఇక్కడితో ఆగిపోవడం లేదు అంటున్నారు. ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాలకు పసుపు రంగులు అద్దుతూ చాలా చోట్ల రూపు రేఖలను మార్చేస్తున్నారు. రానున్న రోజులలో రేషన్ కార్డులకు పసుపు రంగులు అద్ది కొత్తగా మంజూరు చేస్తారని అంటున్నారు. ఇక ఏ పధకం ఇచ్చినా దానికి పసుపు దనం తప్పనిసరి అని కూడా అంటున్నారు.
ఏపీలో టీడీపీ వైసీపీ ఎవరు ఎవరినీ విమర్శించుకోవాల్సింది లేదు. ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ రంగుల పిచ్చి వదిలేది కాదని అంటున్నారు. ప్రజలు కట్టే పన్నులతో ప్రభుత్వం నడుస్తోంది. రాజకీయ పార్టీలు కేవలం అయిదేళ్ళకు మాత్రేమ ఎన్నుకోబడతాయి.
ప్రభుత్వాలు శాశ్వతాలు అలాంటపుడు పార్టీల రంగులు ఎందుకు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఎవరు అధికారంలోకి వచ్చినా పాత రంగులు తీసి కొత్త రంగులు అద్దడానికి కోట్లాది రూపాయల ప్రజా ధనం కూడా వేస్ట్ గా ఖర్చు అవుతోంది అని అంటున్నారు. దాంతో ప్రభుత్వ భవనాలకు రాజకీయ రంగులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉందని అంటున్నారు.