యంగ్ హీరో రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు!
తెలుగు రాష్ట్రాల్లోని రెస్టారెంట్లు, హోటల్స్ లో గత కొద్ది రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లోని రెస్టారెంట్లు, హోటల్స్ లో గత కొద్ది రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ లో ఉన్న హాస్టల్స్, రెస్టారెంట్స్, హోటల్స్ లో కూడా చెకింగ్స్ చేస్తున్నారు. వంట చేసే ప్రదేశాలను ముఖ్యంగా నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా ఆహార భద్రత నిబంధనలు సరిగ్గా పాటించకపోతే తగు చర్యలు తీసుకుంటున్నారు. సూచనలు కూడా ఇస్తున్నారు.
అందులో భాగంగా నేడు సికింద్రాబాద్ లో ఉన్న వివాహ భోజనంబు హోటల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే వివాహ భోజనంబు రెస్టారెంట్ కు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్.. పార్టనర్ గా ఉన్న విషయం తెలిసిందే. సినిమాలు చేస్తూనే.. రెస్టారెంట్ బిజినెస్ లో కూడా ఆయన అడుగుపెట్టారు. హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో యూనిట్స్ ను స్టార్ట్ చేశారు. అన్నీ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
అయితే నేడు సికింద్రాబాద్ యూనిట్ లో జరిపిన తనిఖీల్లో అక్కడ చాలా నాసిరకంగా ఉన్న ఆహార పదార్థాలను అధికారులు గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆహార భద్రత నిబంధనలను ఉల్లంఘించినట్లు టాక్ వినిపిస్తోంది. రెండేళ్ల క్రితం నాటికి గడువు ముగిసిన 25 కిలోల చిట్టి ముత్యాల బియ్యం బ్యాగును రెస్టారెంట్ లో అధికారులు గుర్తించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అప్పటికే కుక్ చేసిన ఆహార పదార్థాలను స్టీల్ పాత్రల్లో ఉంచినట్లు, వాటికి సరైన లేబుల్స్ లేవని తెలుస్తోంది. వంట చేసే ప్లేస్ లో కొన్ని డిస్ట్ బిన్స్.. మూతలు లేకుండా ఉన్నట్లు అధికారులు కనుగొన్నట్లు సమాచారం. వంట చేసే వాళ్ల మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికేట్ లు.. రెస్టారెంట్ యాజమాన్యం అందించలేదని వినికిడి. ఆహార భద్రత చట్టం ప్రకారం.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి. కిచెన్ లో వాడే నీరు బయటకు వెళ్ళే విషయంలో కూడా ఇబ్బందులు ఉన్నట్లు సమాచారం.
దీంతో వినియోగదారుల ఆరోగ్య భద్రత దృష్ట్యా.. గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. సందీప్ కిషన్ కూడా తన రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ రూల్స్ పాటించలేదన్న వార్తలపై ఇప్పటి వరకు స్పందించలేదు. మరో ఏం జరిగిందో తెలియాల్సి ఉంది.