అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థులపై పోప్ సంచలన వ్యాఖ్యలు

యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై పోప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Update: 2024-09-14 07:09 GMT

ప్రాశ్చాత్య దేశాలపై పోప్ మాటల ప్రభావం ఎంత ఉంటుందన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై పోప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నవంబరులో జరిగే ఎన్నికలకు సంబంధించి.. ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నారు. అధికార పగ్గాలు అందిపుచ్చుకోవటానికి చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు. ఇలాంటి వేళలో.. వారిద్దరి తీరు.. వారి ఎజెండాలపై పోప్ ఫ్రాన్సిస్ సీరియస్ కామెంట్లు చేశారు.

ఇద్దరు అధ్యక్ష అభ్యర్థులు జీవించే హక్కుల్నికాలరాస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా ట్రంప్.. అబార్షన్ హక్కులకు మద్దతుగా కమలా హారిస్ ఇస్తున్న హామీలను ఆయన తప్పు పట్టారు. ట్రంప్ శరణార్థులు.. పథకాలను వ్యతిరేకిస్తున్న వైనాన్ని వేలెత్తి చూపారు. అదే సమయంలో ట్రంప్ ప్రత్యర్థి హారిస్ మీదా విమర్శలు కురిపించారు.

పన్నెండు రోజుల పాటు ఆసియా పర్యటనను ముగించుకొని తిరిగి రోమ్ కు వస్తున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ శరణార్థుల పథకాల్ని వ్యతిరేకిస్తున్నారని.. కమలా హారిస్ పిల్లల్నిచంపేందుకు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. రెండు చెడ్డ హామీల్లో తక్కువ చెడు స్థాయి ఉన్నదాన్ని ఎంచుకోవాలని ప్రజలే నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పారు.

అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్న ట్రంప్ అక్రమ వలసదారులను బహిష్కరిస్తామని హామీ ఇవ్వటం.. కమలా హారిస్ అబార్షన్ హక్కులకు మద్దతుగా నిలవటం తెలిసిందే. ఈ రెండు హామీలపై పోప్ తాజాగా మండిపడుతూ.. వారి హామీల్ని తప్పు పట్టారు. పోప్ వ్యాఖ్యలపై వీరిద్దరు ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.

Tags:    

Similar News