రిమాండ్ కు మించిన కొత్త కష్టంలో పోసాని
అనూహ్య రీతిలో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైతే.. ఏదో రకంగా బెయిల్ వచ్చే మార్గాన్ని చూడాల్సిందిగా తమ లాయర్ ను కోరతారు.;
ఒక ప్రముఖుడు జైలుకు వెళ్లటమే ఇబ్బంది. అనూహ్య రీతిలో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైతే.. ఏదో రకంగా బెయిల్ వచ్చే మార్గాన్ని చూడాల్సిందిగా తమ లాయర్ ను కోరతారు. అయితే.. అన్ని సందర్భాల్లోనూ బెయిల్ మంజూరు కాదు. అలాంటప్పుడు రిమాండ్ ఖైదీగా జైల్లో ఉండాల్సిన పరిస్థితి. ఇదే ఒక కష్టమైతే.. ఒకటి తర్వాత ఒకటి చొప్పున పలు జైళ్లకు తిరగాల్సి రావటానికి మించిన పెద్ద శిక్ష మరొకటి ఉండదు. ఇప్పుడు అలాంటి అరుదైన పరిస్థితి ప్రముఖ నటుడు పోసాని క్రిష్ణమురళికి ఎదురవుతోంది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆయన కుటుంబ సభ్యుల్ని నోటితో మాట్లాడలేని.. చేతితో రాయలేని రీతిలో బండ బూతులు తిట్టిన ఆయనకు ఇప్పుడు ‘సినిమా’ కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో పోసాని తన నోటిని అవసరానికి మించి వాడటం.. ఈ సందర్భంగా ఆయనపై పలువురు ఫిర్యాదులు చేసినా కేసులు కట్టింది లేదు. కూటమి సర్కారు కొలువు తీరిన తర్వాత కూడా తొమ్మిది నెలల పాటు ఎలాంటి చర్యలు తీసుకున్నది లేదు.
ఇలాంటి వేళ.. అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లె పోలీసులు పోసాని క్రిష్ణమురళి మీద కేసు నమోదు చేయటం.. హైదరాబాద్ లోని ఆయన విలాసవంతమైన ప్లాట్ కు వచ్చి మరీ అరెస్టు చేయటం తెలిసిందే. సుదీర్ఘ వాదనల అనంతరం ఆయనకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడి వరకు రెగ్యులర్ సీనే నడిచింది. ఆ తర్వాతే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోసాని నోటి దూకుడు మీద ఏపీ వ్యాప్తంగా పలువురు కేసులు పెట్టటంతో.. ఆయా జిల్లాలకు చెందిన పోలీసులు పోసాని ఉంటున్న జైలు వద్దకు వచ్చి.. తమకు అప్పగించాల్సిందిగా కోరుతున్నారు.
దీంతో ఒకటి తరవాత మరొకరు అన్నట్లుగా వేర్వేరు జిల్లాల పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలిస్తున్నారు. అన్నమయ్య జిల్లా నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట జైలుకు తరలించారు. అక్కడి నుంచి తాజాగా కర్నూలు జిల్లాలోని జైలుకు తరలించారు. ఇప్పటివరకు ఆయనపై 17 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఒకటి తర్వాత మరొకటి చొప్పున కేసు పోసాని మెడకు చుట్టుకుంటోంది. దీంతో.. ఆయన ఒక జైలు తర్వాత మరో జైలుకు షిప్టు కావాల్సి వస్తోంది.
ఆయనపై నమోదైన కేసుల ప్రకారం.. ఆయన్ను విచారించేందుకు తమకు అప్పగించాలంటూ కోరుతున్న పోలీస్ స్టేషన్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతో.. ఆయన ఏపీ వ్యాప్తంగా ఉన్న మెజార్టీ జైళ్లను చూడాల్సి ఉంటుందని చెబుతున్నారు. సాధారణంగా 21 రోజుల జైలును విధిస్తారు. కొన్నిసార్లు రెండు వారాల రిమాండ్ కూడా ఉంటుంది. ఒక రిమాండ్ పూర్తి కాక ముందే మరో పోలీస్ స్టేషన్ నుంచి సిబ్బంది వచ్చి తమకు పోసానిని అప్పగించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పట్లో బయటకు రావటం కష్టమని.. అదే సమయంలో ఏపీ వ్యాప్తంగా ఉన్న పలు జైళ్లకు పోసాని వెళ్లాల్సి రావటం ఖాయమంటున్నారు. మిగిలిన ప్రముఖులకు భిన్నంగా పోసాని కవర్ చేసిన జైళ్ల సంఖ్య రాష్ట్రంలోని మరే ప్రముఖుడికి ఉండదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదంతా చూస్తున్న కొందరు.. పోసానిపై పెట్టిన కేసులకు విధించే శిక్ష కన్నా.. రోజుకో జైలుకు వెళ్లాల్సి రావటమే అతి పెద్ద పనిష్ మెంట్ గా అభివర్ణిస్తున్నారు.