ఏపీలో 'పోసాని' లీగల్ టూర్?

దీంతో పోసాని కష్టం పగోడికి కూడా రావద్దంటూ ఏపీలోని ఆయన సానుభూతిపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.;

Update: 2025-03-08 12:58 GMT

రోజుకో కేసు బయటకొస్తోంది.. ఏపీ వ్యాప్తంగా పోసానిపై నమోదైన కేసులన్నింటిని బయటకు తీస్తున్నారు. ఒక కేసులో బెయిల్ రాగానే మరో కేసులో అదుపులోకి తీసుకొని అరెస్ట్ చూపించి జైలుకు పంపుతున్నారు. మొదట రాజంపేట.. తర్వాత నరసరావుపేట.. ఇప్పుడు విజయవాడ.. క్యూలో ఇంకా చాలా ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి.. దీన్ని బట్టి పోసాని ఇప్పుడు ఏపీలో ‘లీగల్ టూర్’ చేస్తున్నారని ఏపీలో అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది.. బెయిల్ పై బయటకు రాకుండా కేసుల పేరుతో తిప్పుతున్నారని అంటున్నారు. ఇదే విషయాన్ని పోసాని కూడా జడ్జికి చెప్పుకున్నారు. ‘తనపై అక్రమంగా కేసు పెట్టారని.. ఒకే రకమైన కేసులతో అన్ని ప్రాంతాలకు తిప్పుతున్నారని.. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని’ తెలిపారు. దీంతో పోసాని కష్టం పగోడికి కూడా రావద్దంటూ ఏపీలోని ఆయన సానుభూతిపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ నటుడు, వైసీపీ నాయకుడు పోసాని క్రిష్ణ మురళిని నరసరావుపేట కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. బొబ్బర్లపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో అతడిని రెండు రోజుల పాటు విచారించనున్నారు. బొబ్బర్లపల్లి కేసులో పోసాని ముందుగా కడప కోర్టులో బెయిల్ పొందినప్పటికీ, విజయవాడలో ఉన్న మరో కేసు కారణంగా అతను ఇంకా కస్టడీలోనే ఉన్నాడు.

నరసరావుపేట కోర్టు రెండు రోజుల పోలీస్ కస్టడీని మంజూరు చేసింది. ఇదే సమయంలో విజయవాడ జిల్లా కోర్టు మరో కేసులో పోసానిపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ పరిణామం అతని చట్టపరమైన సమస్యలను మరింత క్లిష్టతరం చేసింది. ఎందుకంటే అతను అనేక విచారణలు ఒకదాని వెంట మరొకటి నమోదు అవుతుండడంతో బెయిల్ తీసుకున్నా మరో కేసులో జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన బయటకు రాలేకపోతున్నారు.

నరసరావుపేట కేసులో పోసాని వేసిన బెయిల్ పిటిషన్ ఈ నెల 10న విచారణకు రానుంది. కోర్టు బెయిల్ నిరాకరిస్తే, అతను హైకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది.

దీనికి తోడు విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్ కూడా పోసానిపై నాన్-బెయిలబుల్ వారెంట్ కోసం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విజయవాడ జిల్లా కోర్టు ఆమోదించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.

దీంతో పోసాని క్రిష్ణ మురళి వరుస కేసులతో పోలీస్ స్టేషన్లు .. కోర్టుల చుట్టూ తిరుగుతూ, పలు కేసులు, విచారణలతో బిజీగా ఉన్నాడు. ఏపీలో ఓ రకంగా ‘లీగల్ టూర్’ చేస్తున్నట్టే.. వైఎస్సార్సీపీ న్యాయవాదుల బృందం పోసాని విడుదల కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.

Tags:    

Similar News