పోతిన మహేష్ రూటు అటేనా...కూటమికి టెన్షన్...!?

జనసేనలో గట్టి గొంతుకగా వినిపించే పోతిన మహేష్ కి టికెట్ ఖాయం అని అంతా అనుకున్నారు.

Update: 2024-04-08 03:30 GMT

విజయవాడ జనసేన అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ అయిన పోతిన మహేష్ తన యాక్షన్ ప్లాన్ ని ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన బలమైన బీసీ నేత. అయిదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించిన నాయకుడు. జనసేనలో గట్టి గొంతుకగా వినిపించే పోతిన మహేష్ కి టికెట్ ఖాయం అని అంతా అనుకున్నారు.

జనసేన పొత్తులో ఉన్నా విడిగా పోటీ చేసినా కొందరికి ఈసారి టికెట్లు ఖాయమని అంతా లెక్క వేశారు. ఆ జాబితాలో పోతిన మహేష్ పేరు కచ్చితంగా ఉంటుంది. కానీ ఆయనకు తీరని అన్యాయం జరిగింది అని అనుచరులు అంటున్నారు. అయిదేళ్ళుగా పార్టీ కోసం పనిచేసిన మహేష్ కి టికెట్ ఇస్తే కనుక కచ్చితంగా గెలిచేవారు అని అంతా అనుకున్నారు.

కానీ అనూహ్యంగా అక్కడ నుంచి బీజేపీ తరఫున బిగ్ షాట్ సుజనా చౌదరి పోటీకి దిగిపోయారు. ఆయన వంటి బడా నేత కూటమి అభ్యర్ధి అయ్యాక ఇక కదపడం అసాధ్యం అని అంటున్నారు. అదే మాటను పోతిన మహేష్ కూడా మీడియా ముందు చెప్పారు. బలమైన నాయకుడిని తెచ్చి కూటమి అభ్యర్ధిగా పెట్టారు. ఈ దశలో కూడా టికెట్ కోసం పట్టుబట్టడం, పోరాడటం అంటే అంతకంటే అవివేకం లేదని అన్నారు.

అందువల్ల తాను తన అనుచరులు ఆత్మీయులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నామని తమ కార్యాచరణ ఏంటి అన్నది రెండు రోజులలో ప్రకటిస్తామని మహేష్ అంటున్నారు. అది ఏమిటి అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు. టీడీపీ తన పార్టీ అభ్యర్ధులను కొన్ని సీట్లలో మారుస్తోంది. మరి జనసేన ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోదని పోతిన మహేష్ ప్రశ్నిస్తున్నారు. ఇక మీదట అలా తీసుకుంటుందన్న ఆశలు కూడా లేవని అన్నారు.

అయితే బీసీ నేతగా పోతిన మహేష్ ఉన్నారు. ఇదిలా ఉంటే పోతిన మహేష్ 2019 ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయనకు 22 వేల 367 ఓట్లు లభించాయి. టీడీపీకి వచ్చిన ఓట్లలో సగం దాకా ఆయన సాధించారు అన్న మాట. విజయవాడలో పశ్చిమలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. అలాగే మైనారిటీలు ఉన్నారు. దాంతో బీసీల మద్దతుతో పోతిన మహేష్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు అని అంటున్నారు.

అదే సమయంలో ఆయనకు వైసీపీ నుంచి కూడా ఆహ్వానం ఉంది అని అంటున్నారు. వైసీపీ నేతలు తమ పార్టీలోకి వస్తే సరైన గౌరవం ఇస్తామని అంటున్నారు. అలాగే బాగా చూసుకుంటామని చెబుతున్నారు. మరి పోతిన మహేష్ వైసీపీలో చేరుతారా అన్నది చూడాలి. అయితే ఆయన అనుచరుల పట్టుదల చూస్తే ఇండిపెండెంట్ గానే పోటీ చేసి తాడో పేడో తేల్చుకోవాలని ఉంది.

దాంతో పోతిన మహేష్ ఇండిపెండెంట్ గా పోటీ చేయడం ఖాయమని అంటున్నారు. ఆయన పోటీకి దిగితే మాత్రం సుజనా చౌదరికే అది పెద్ద దెబ్బ అని అంటున్నారు. కూటమి ఓటు బ్యాంక్ కే గండి కొడతారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News