వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా ప్రభాస్ పెద్దమ్మ...!?
మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబం నుంచి కూడా ఎవరినైనా నిలబెట్టాలని ఆలోచిస్తోంది.
వైసీపీ ఎంపీ సీట్లకు గట్టి అభ్యర్ధులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. అదే విధంగా కొందరిని టార్గెట్ చేసి మరీ అభ్యర్ధుల ఎంపికను చేస్తున్నారు. అలా చూసుకుంటే నాలుగున్నరేళ్ల పాటు వైసీపీ హై కమాండ్ కి కంట్లో కునుకు లేకుండా చేసిన నర్సాపురం రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజుని ఈసారి ఎలాగైనా ఓడించాలని వైసీపీ అధినాయకత్వం పంతమే పట్టింది అని అంటున్నారు.
నర్సాపురంలో వైసీపీ ఎంతో మందిని ఎంపీ అభ్యర్ధి కోసం పరిశీలిస్తోంది. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబం నుంచి కూడా ఎవరినైనా నిలబెట్టాలని ఆలోచిస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే రెబెల్ స్టార్ గా పేరు తెచ్చుకుని సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం కలిగి ఉన్న కృష్ణం రాజు సతీమణి శ్యామలాదేవి ని వైసీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో నర్సాపురం ఎంపీ సీటుకు అభ్యర్ధిగా నిలబెట్టాలని వైసీపీ అధినాయకత్వం సీరియస్ గా ఆలోచిస్తొంది అని అంటున్నారు
కృష్ణం రాజు రాజకీయంగా కూడా రాణించారు. ఆయన రెండు సార్లు ఎంపీగా కాకినాడ, రాజమండ్రిల నుంచి గెలిచారు. వాజ్ పేయి ప్రభుత్వం కేంద్రంలో కీలక మంత్రిత్వ శాఖలకు మంత్రిగా పనిచేసారు. ఆయన సొంత గ్రామం మొగల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో కృష్ణం రాజు కుటుంబానికి ఎంతో పట్టు ఉంది.
దాంతో ఆయన సతీమణి శ్యామాలాదేవిని అభ్యర్ధిగా నిలబెడతారు అని ప్రచారం అయితే గోదావరి జిల్లలలో పెద్ద ఎత్తున సాగుతోంది. ఇక చూస్తే కృష్ణం రాజు జయంతి జనవరి 20న ఉంది. ఆ రోజున శ్యామలాదేవి అతి పెద్ద వైద్య శిబిరాన్ని మొగల్తూరులో ఏర్పాటు చేస్తున్నారు. దేశ విదేశాలకు చెందిన ఇరవై మందికి పైగా ప్రముఖ వైద్యులు కూడా ఈ వైద్య శిబిరంలో పాలు పంచుకుంటున్నారు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఈ వైద్య శిబిరం తరువాత తన రాజకీయ ప్రవేశం గురించి ప్రకటిస్తాను అని స్వయంగా శ్యామలాదేవి తెలియచేయడం. ఇదిలా ఉంటే శ్యామలాదేవికి రాజకీయ ఆసక్తి ఉందని అంటున్నారు. ఆమె నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు అని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది.
వైసీపీ కూడా ఆమెతో సంప్రదింపులు జరుపుతోంది అని కూడా అంటున్నారు. ఇపుడు రెబెల్ స్టార్ జయంతి వేళ ఆమె ఏమి చెబుతారు అన్న ఉత్కంఠ అయితే అందరిలో ఉంది. మరో ప్రచారం ఏంటి అంటే ఆమె ఇప్పటికే వైసీపీ హై కమాండ్ ని సంప్రదించి ఈ మేరకు హామీ తీసుకున్నారని అంటున్నారు. ఆమెను ఎంపీ అభ్యర్ధిగా నర్సాపురం నుంచి నిలబెట్టడానికి జగన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.
ఇక గోదావరి జిల్లాలలో కాపుల ప్రభావంతో పాటు క్షత్రియుల ప్రభావం కూడా ఎక్కువ. అదే విధంగా రెబెల్ ఎంపీ రఘురామను కట్టడి చేసి ఈసారికి ఓడించాలంటే కృష్ణం రాజు సతీమణి సరైన అభ్యర్ధి అని వైసీపీ భావిస్తోంది అంటున్నారు. ఆమె కనుక పోటీలో ఉంటే ప్రభాస్ అభిమానులు కూడా వైసీపీ వైపు టర్న్ అవుతారు అన్న అంచనాలు ఉన్నాయి. దాంతో పాటు జనసేన ప్రభావాన్ని కూడా గోదావరి జిల్లాలలో తగ్గించవచ్చు అని కూడా భావిస్తున్నారు. మొత్తానికి కృష్ణం రాజు సతీమణి రాజకీయ ప్రవేశం వార్త అయితే సంచలనంగానే ఉండోబోతోంది అంటున్నారు.