ఇప్పుడేం చెబుతారు? .. జ‌స్ట్ ఆస్కింగ్‌: ప్ర‌కాష్‌రాజ్‌

ఈ క్ర‌మంలో తాజాగా ల‌డ్డూ వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న కోట్ చేస్తూ.. ఇప్పుడేం చెబుతారు? అని ప్ర‌శ్నించారు.

Update: 2024-09-30 15:18 GMT

'జ‌స్ట్ ఆస్కింగ్‌' క్యాప్ష‌న్‌తో సునిశిత రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేసే బ‌హుభాషా న‌టుడు ప్ర‌కాష్‌రాజ్‌.. తాజాగా ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌ను ఉద్దేశించి కీల‌క ప్ర‌శ్న‌లు సంధించారు. ''ఇప్పుడేం చెబుతారు?'' అని వ్యాఖ్యానించారు. తిరు మల శ్రీవారి ప‌విత్ర ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీ వ్య‌వ‌హారంపై ఏపీ స‌ర్కారును, ముఖ్యంగా డిప్యూటీ సీఎంను ఉద్దేశించి.. ఆది నుంచి కూ డా ప్ర‌కాష్‌రాజ్ నిశిత విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ల‌డ్డూ వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న కోట్ చేస్తూ.. ఇప్పుడేం చెబుతారు? అని ప్ర‌శ్నించారు. ఈ పోస్టులో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫొటోల‌ను ఆయ‌న పోస్టు చేశారు.

'దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి' అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్ర‌కాష్‌రాజ్‌ ప్రస్తావించారు. దీనిని తాను ముందే చెప్పాన‌ని.. సునిశిత అంశాల‌ను సునిశితంగానే చూడాల‌ని.. కానీ, రాజ‌కీయంగా చూశార‌ని ఇప్పుడు సుప్రీంకోర్టు దీనిని ప్ర‌శ్నించింద‌ని అన్నారు. దీనికి ఏం స‌మాధానం చెబుతార‌ని అన్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయ‌లు వేసింద‌న్నారు. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని సూచించిందని, ఇప్ప‌టికైనా దీనిని పాటించాల‌ని ప్ర‌కాష్ రాజ్ సూచించారు.

ఇక‌, నెయ్యి క‌ల్తీ అయిన‌ట్టు ఆధారాలు ఏవ‌ని ప్ర‌శ్నించిన సుప్రీంకోర్టు వ్యాఖ్య‌ల‌ను కూడా ప్ర‌కాష్ రాజ్ కోట్ చేశారు. గుజ‌రాత్‌లోని ఎన్‌డీబీడీ ల్యాబ్ రిపోర్టులో స్ప‌ష్ట‌త లేద‌న్న సుప్రీం వ్యాఖ్య‌ల‌ను కూడా ప్ర‌స్తావించారు. దీనికి ఏం చెబుతార‌ని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. నెయ్యి కల్తీ అయినట్లుగా రుజువులు లేవ‌ని, అలాంటప్పుడు సీఎం నేరుగా మీడియా ముందుకు ఎలా వెళ్లారని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించిన విష‌యాన్ని కూడా ప్ర‌కాష్ రాజ్ లేవ‌నెత్తారు. అంతేకాదు.. సుప్రీంకోర్టు ప్ర‌శ్నించిన‌.. లడ్డూ రిపోర్టు.. జూలైలో వ‌స్తే.. సెప్టెంబ‌రు వ‌ర‌కు ఏం చేశార‌న్న విష‌యాన్ని ప్ర‌శ్నిస్తూ.. దీనికి ఏం స‌మాధానం ఉంద‌న్నారు.

కాగా, ప్ర‌కాష్ రాజ్‌.. తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారంపై ఆది నుంచి కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ప‌వ‌న్ చేప‌ట్టిన ప్రాయ‌శ్చిత్త దీక్షను కూడా ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. ల‌డ్డూ-రాజ‌కీయం పై త‌న‌దైన శైలిలో ప్ర‌శ్న‌లు గుప్పించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో మ‌రోసారి 'జ‌స్ట్ ఆస్కింగ్‌' అంటూ కొన్ని ప్ర‌శ్న‌లు లేవ‌నెత్త‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News