సింగం నటుడి వ్యంగ్యం ట్వీట్... ప్రకాశ్ రాజ్ పై కేసు నమోదు!
చంద్రయాన్ - 3పై సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్టు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో... బనహట్టి పోలీసు స్టేషన్ లో హిందూ సంస్థ నాయకుడు ఫిర్యాదు చేశాడు.
చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ ను సురక్షితంగా దించేందుకు అన్ని రకాల సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో యావత్ దేశం సహా ప్రపంచ దేశాలు చంద్రయాన్ 3 ల్యాండింగ్ గురించి సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఈ క్రమంలో క్యారికేచర్ తో కూడిన పోస్ట్ ను ప్రకాష్ రాజ్ పంచుకున్నారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది!
అవును... జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ తో సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందించే విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్ట్ లోని క్యారికేచర్ ఇస్రో సైంటిస్టులను అవమానపరిచేలా ఉందంటూ నెటిజన్లు ఫైరవుతున్నారు!
దీంతో... ప్రకాశ్ రాజ్ పై కర్ణాటకాలోని బాగాల్ కోట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. చంద్రయాన్ - 3పై సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్టు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో... బనహట్టి పోలీసు స్టేషన్ లో హిందూ సంస్థ నాయకుడు ఫిర్యాదు చేశాడు. ప్రకాశ్ రాజ్ పై చర్యలు తీసుకోవలని డిమాండ్ చేశాడు.
కాగా... బీజేపీపీ నేతలపైనా, ఆ పార్టీ అనుసరించే విధానాలపైనా ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తుండే ప్రకాశ్ రాజ్... పలు సందర్భాల్లో ప్రధాని మోడీపైనా వ్యక్తిగత విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా... "బ్రేకింగ్ న్యూస్.. విక్రమ్ ల్యాండర్ పంపిన తొలి ఫొటో" అంటూ ఒక ఫోటో పోస్ట్ చేశారు.
దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో... ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్ చేశారు. ద్వేషం ఎప్పుడూ ద్వేషాన్ని మాత్రమే చూస్తుందని.. తాను నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కాలం నాటి జోక్ ను చెప్పానని పేర్కొన్నారు. తాను కేరళ చాయ్ వాలా గురించి ప్రస్తావించానని.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు ఏ ఛాయ్ వాల్ గురించి అనుకుంటున్నారని ప్రశ్నించారు. జోక్‌లు అర్థం కాకపోతే మీరే జోకర్లు అవుతారని వ్యంగ్యంగా స్పందించారు.