సంబరం వేళ.. బాబు ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ ప్రకాశ్ రాజ్ సెటైర్

సుదీర్ఘంగా సాగిన ఏడు దశల సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు మంగళవారం నాటి ఫలితాలతో తెరపడింది.

Update: 2024-06-05 14:30 GMT

సుదీర్ఘంగా సాగిన ఏడు దశల సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు మంగళవారం నాటి ఫలితాలతో తెరపడింది. కేంద్రంలో కొంత వెనుకబడినా మరోసారి ఎన్డీఏనే రానున్నట్లు స్పష్టమైంది. అన్నిటికి మించి ఏపీలో చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అఖండ విజయం సాధించింది. దీంతో బాబుకు డబుల్ బెనిఫిట్ దక్కినట్లయింది. కేంద్రంలో మంత్రి పదవులు పొందేంతగా టీడీపీ అవసరం బీజేపీకి ఏర్పడడం ఈ సారి విశేషం.

ఐదేళ్ల కిందటికి ఇప్పటికి.

2018 వరకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ప్రత్యేక హోదా ఇతర అంశాల్లో విభేదించి బయటకు వచ్చింది. అంతేగాక మోదీని అప్పటి ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. వ్యక్తిగతంగానూ తప్పుబట్టారు. ఢిల్లీలో ధర్నాలు, ఆందోళనలు చేశారు. అమిత్ షా తిరుపతి వస్తే తీవ్ర నిరసన తెలిపారు. ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడింది. కాగా, ఇటీవలి ఎన్నికలకు ముందు పరిస్థితి మారింది. జనసేన చొరవతో టీడీపీ, బీజేపీ కలిశాయి. ఆ కూటమి ఎంతటి ప్రభంజనం రేపిందో అందరూ చూశారు.

నాటి ట్వీట్ ను గుర్తుచేస్తూ..

దేశంలో రాజకీయేతర వ్యక్తుల్లో మోదీని ద్వేషించేవారిలో ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఒకరు. ఆయన గతంలో ఎన్నికల్లోనూ పోటీకి దిగారు. తాజాగా చంద్రబాబు బీజేపీకి మద్దతు, ఎన్డీఏ కూటమిలో అధికారం చేపట్టనున్న వేళ ప్రకాశ్ రాజ్ ఓ ట్వీట్ చేశారు. 2019 ఏప్రిల్ 16 నాడు చంద్రబాబు చేసిన ఆ ట్వీట్ లో ఏమున్నదంటే.. ‘‘మోదీ ప్రతిష్ఠాత్మక వ్యవస్థలను క్రమపద్ధతితో ధ్వంసం చేశారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం, వ్యవస్థల స్వాతంత్ర్యం ప్రమాదంలో పడ్డాయి. సీబీఐ నుంచి ఆర్బీఐ వరకు చివరకు ఎన్నికల సంఘాన్నీ బీజేపీ-మోదీ వదల్లేదు’’ అంటూ ధ్వజమెత్తారు. సరిగ్గా ఈ ట్వీట్ ను ప్రకాశ్ రాజ్ ఇప్పుడు పోస్ట్ చేస్తూ ‘‘చాలా నిజం సార్’’ అని కామెంట్ పెట్టారు. దీనికి జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు.

Tags:    

Similar News