ప్రశాంత్ కిశోర్ చెప్పింది నమ్మొచ్చా?
అవును... ఏపీలో అధికార పార్టీపై గతకొన్ని రోజులుగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న ప్రశాంత్ కిశోర్.. మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఏపీలో జగన్ కు మరో ప్రతిపక్షంలా తయారయ్యారు ప్రశాంత్ కిశోర్ అనే మాటలు గతకొన్ని రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుపు అసాధ్యం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, అందుకు చెప్పిన కారణాలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. తానేమీ సర్వేలు చేయలేదు అని అంటూనే... తన అభిప్రాయాన్ని జోస్యంగా చెప్పడంతో వైసీపీ నేతలు పీకేపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో మరోసారి వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ కిశోర్.
అవును... ఏపీలో అధికార పార్టీపై గతకొన్ని రోజులుగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న ప్రశాంత్ కిశోర్.. మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... గతంలో జనసేనతో పొత్తుకోసం వైసీపీ ప్రయత్నించిందని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో సంచలనంగా మారాయి. దీనికి సంబంధించిన వీడియోను జనసేన తన అధికారిక ఎక్స్ లో పోస్ట్ చేసింది.
టీడీపీ - జనసేన పొత్తుల్లేకుండా పోటీ చేయలేవని.. 175 నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీలకు క్యాండిడేట్లే లేరని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్న నేపథ్యంలో... గతంలో తమపొత్తు కోసం వైసీపీ ప్రయత్నించిందంటూ ప్రశాంత్ కిశోర్ మాట్లాడిన వీడియోను జనసేన షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో రాజకీయవర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వీడియోతోపాటు... "2017 నంద్యాల ఉప ఎన్నికల ఓటమి తర్వాత జనసేనతో పొత్తు కోసం వైసీపీ ప్రాధేయపడింది" అని రాసుకొచ్చింది.
2017లో జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో ఓటమి తర్వాత వైసీపీ తిరిగి పుంజుకునే ప్రయత్నాల్లో భాగంగా జనసేనతో పొత్తును పరిశీలించినట్లు ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. ఈ మేరకు ఆ దిశగా ప్రయత్నించాలని తనతో వైసీపీ నేతలు చెప్పినట్లు పీకే తెలిపారు. దీంతో... గతంలో జనసేనతో పొత్తుకోసం వైసీపీ ప్రయత్నించిందంటూ గట్టిగా చెబుతున్న పీకే మాటలు నమ్మొచ్చా.. నమ్మేలా ఉన్నాయా అనే చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది.
పైగా గతకొన్ని రోజులుగా వైసీపీకి వ్యతిరేకంగా అన్నట్లుగా మాట్లాడుతున్న ప్రశాంత్ కిశోర్ ఈ సమయంలో వైసీపీపై మరింత బురద జల్లే ప్రయత్నంగా చూసే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి ఈ విషయాలపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి.