పీకే రాజకీయ అవతార్

రాజకీయ వ్యూహాలు తనకు అన్నీ తెలుసు కాబట్టి రాజకీయంగా సక్సెస్ కొడతాను అన్నది ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే ఆలోచన కావచ్చు

Update: 2024-06-10 10:18 GMT

రాజకీయ వ్యూహకర్త కాస్తా రాజకీయ నేతగా మారుతున్నారు. రాజకీయ వ్యూహాలు తనకు అన్నీ తెలుసు కాబట్టి రాజకీయంగా సక్సెస్ కొడతాను అన్నది ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే ఆలోచన కావచ్చు. నిజానికి పీకే చాలా కాలం నుంచి రాజకీయ అడుగులు వేయాలని చూస్తున్నారు.

ఆయన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటి ఐ ప్యాక్ వ్యవస్థాపకుడు. ఐప్యాక్ ద్వారా చాలా సర్వేలు చేయిస్తూ ఎన్నికలలో పార్టీలకు వ్యూహాలు అందిస్తూ విజయపధంలో నడిపించడం కోసం పీకే చాలా చేశారు. ఆయన ఖాతాలో సక్సెస్ ఉంది ఫెయిల్యూర్ ఉంది. అయితే అందరికీ ఇంత మేలు చేసిన వాడిని తాను ఎందుకు పొలిటికల్ గా సక్సెస్ కాకూడదు అని ఆయన 2022లో తన సొంత రాష్ట్రం బీహార్ లో జన్ సురాజ్ అభియాన్ పేరుతో ఒక సంస్థను స్థాపించారు.

ఈ సంస్థ ఆశయం ఏమిటి అంటే మంచి పాలన కోసం జనాలను చైతన్యం చేయడం, బీహార్ లో అమలు అవుతున్న అసంబద్ధ పాలనను జనాలు వ్యతిరేకించేలా చూడడం, తద్వారా వారిని తన వైపు తిప్పుకుని రేపటి రోజున రాజకీయ అవతారం ఎత్తేందుకు ప్రయత్నించడం.

ఈ విధంగా ఆయన జన సురాజ్ అభియాన్ ద్వారా బీహార్ లో పాదయాత్ర చేపట్టారు. ప్రజలను నేరుగా కలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే జనాల స్పందన మాత్రం పెద్దగా లభించలేదు. దాంతో ఆ మధ్యలో దానికి గ్యాప్ ఇచ్చి మళ్ళీ తన పాత వృత్తి అయిన రాజకీయ వ్యూహాలు అందించడం, సలహాలు ఇవ్వడం వంటివి చేసారు.

అలాగే ఆయన తెలంగాణాలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి తేవడానికి సలహా సూచనలు అందించారు. అయితే ఆ ప్రయత్నం విఫలం అయింది. ఇక ఏపీలో తెలుగుదేశం పార్టీకి కూడా పరోక్షంగా ఆయన ఇచ్చిన సలహా సూచనలు ఆయన అందించిన వ్యూహాలు ఫలించి అధికారంలోకి వచ్చింది.

అలా పీకే తన స్ట్రాటజీలకు మళ్ళీ ఎంతో కొంత పరువు ఉందని నిరూపించుకున్నారు. ఇపుడు ఆయన తన రాజకీయ కోరికను తీర్చుకునే పనిలో పడ్డారు. సోమవారం ఆయన ఒక సంచలన ప్రకటన చేశారు. జన్ సురాజ్ అభియాన్ సంస్థను రాజకీయ పార్టీగా మారుస్తున్నట్లుగా ప్రకటించారు. బీహర్ లో ప్రాంతీయ పార్టీగా దానిని తీర్చిదిద్దనున్నట్లుగా వెల్లడించారు. దీని వల్ల 2025లో బీహార్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేస్తుంది అన్న మాట. అలా బీహార్ కి కింగ్ కావాలని తన చిరకాల కోరిక ముఖ్యమంత్రి కావాలని పీకే గట్టిగా భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

బీహార్ లో కావాల్సినంత ప్రభుత్వ వ్యతిరేకత ఉందని పీకే నమ్ముతున్నారు. గత ముప్పయి అయిదేళ్ళుగా అటు లాలూ ఇటు నితీష్ కుమార్ ల పాలనలో బీహార్ అత్యంత వెనకబడిన స్టేట్ గా ఉందని. ఈ రెండు పార్టీల ఆలోచనలు పొలిటికల్ ఐడియాలజీలు ఒక్కటే అని పీకే అంటున్నారు. బీహార్ అభివృద్ధికి ఈ రెండు పార్టీల వల్ల ఎలాంటి అవకాశం లేదని కూడా ఆయన అంటున్నారు.

అందువల్ల కొత్త చైతన్యం రావాలని ప్రజలు అభివృద్ధి చెందాలి అంటే కొత్త రాజకీయం రావాలని పీకే భావిస్తున్నారు. బీహార్ లో ఉన్న రాజకీయ శూన్యతను భర్తీ చేసేలా తన జన సురాజ్ అభియాన్ పార్టీ ఉంటుదని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు.

మొత్తం మీద చూస్తే పీకే రాజకీయ అవతార్ ఎత్తేస్తున్నారు. ఆయన పార్టీ తొందరలో ప్రారంభం కాబోతోంది. ఎందరికో శకునాలు చెప్పిన పీకే తాను కుడితిలో పడి బల్లి మాదిరి అవుతారా లేక తానే ఒక రాజకీయ పార్టీ అధినేతగా జనాభిమానం పొంది విజేత అవుతారా అన్నది చూడాలి. పీకే ఈ కీలక సమయంలో పార్టీ ప్రకటన చేశారు అంటే ఆయన వెనక ఎవరు ఉన్నారు. ఆయన వ్యూహాలు ఏమిటి అన్న చర్చ కూడా సాగుతోంది.

Tags:    

Similar News