ప్రిగోజిన్ మృతి... పుతిన్ వైపు ప్రపంచం చూపు!

దీంతో.. ఆ సమయంలో విమానంలోని ప్రయాణిస్తోన్న 10 మందీ మృతి చెందినట్లు చెబుతున్నారు.

Update: 2023-08-24 06:00 GMT

అధ్యక్షుడు పుతిన్‌ పై తిరుగుబాటు చేసి వెనక్కి తగ్గిన రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్‌ గ్రూపు అధినేత యెవ్‌ గనీ ప్రిగోజిన్‌(62) విమాన ప్రమాదంలో మరణించారు. మొదట్లో ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించనప్పటికీ... రష్యా అధికారిక న్యూస్ ఏజెన్సీ.. మృతుల్లో ప్రిగోజిన్ ఉన్నట్లు ప్రభుత్వం నిర్ధారించినట్లు పేర్కొంది. దీంతో ఆయన మృతి కన్ ఫాం అయ్యింది!

ప్రైవేటు జెట్‌ విమానం మాస్కో నుంచి సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో.. ఆ సమయంలో విమానంలోని ప్రయాణిస్తోన్న 10 మందీ మృతి చెందినట్లు చెబుతున్నారు. మాస్కోకు ఉత్తరాన ఉన్న త్వేర్‌ రీజియన్‌ లో ఎంబ్రాయర్‌ విమానం కూలిపోయింది!

రెండు నెలల కిందట ప్రపంచం మొత్తానికీ పూర్తిస్థాయిలో పరిచయమయ్యాడు ప్రిగోజిన్. రష్యాలో అంతర్యుద్ధాన్ని లేవదీసిన తిరుగుబాటు నేతగా గుర్తింపు పొందారు. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ కు కుడిభుజంలా ఉంటూ వచ్చారు. అనంతరం ఆయనే పక్కలో బల్లెంలా మారారు!

వాగ్నర్‌ గ్రూప్‌ అధినేత ప్రిగోజిన్‌ అంతకముందు సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ డిప్యూటీ మేయర్‌ గా పని చేశారు. అలా అంచెలంచెలుగా అధ్యక్షుడి అండతో ఆర్థికంగా ఎదిగి వాగ్నర్‌ ముఠాకు అధినేత అయ్యారు. ఉక్రెయిన్‌ పై యుద్ధంలో రష్యా తరఫున క్రియాశీలంగా పోరాడారు. వాగ్నర్‌ గ్రూపు ఆఫ్రికాలోని మాలి తదితర చోట్ల పనిచేస్తోంది.

అయితే ఈ వాగ్నర్‌ గ్రూపులో 90 శాతం మంది ఖైదీలే అని అమెరికా ఓ నివేదికలో పేర్కొంది. హత్య, ఇతర క్రూర నేరాలు చేసిన వ్యక్తులను వాగ్నర్‌ ముఠా సైనికులుగా చేర్చుకుంటుందని ఆరోపించింది. ఈ క్రమంలో ప్రిగోజిన్‌ అగ్రరాజ్యాల వాంటెడ్‌ జాబితాలో చేరాడు.

ఈ క్రమంలో తాజాగా గత జూన్‌ లో పుతిన్‌ పై వాగ్నర్‌ గ్రూపు చేసిన ఒక్కరోజు తిరుగుబాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తిరుగుబాటు మొదలుపెట్టిన కొద్దిసేపటికే ప్రిగోజిన్‌ సేన వెనక్కి తగ్గింది.

అయితే ఆయన ఇటీవలే పుతిన్‌ తో భేటీ అయ్యారు. బెలారస్‌ లో అతనికి పుతిన్‌ ఆశ్రయమిచ్చారు. ఈ నేపథ్యంలో విమాన ప్రమాదం చోటుచేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇతని మరణం వెనుక పుతిన్ ఉన్నారనే ప్రచారం మొదలైందని అంటున్నారు!

కాగా... వాగ్నర్‌ గ్రూప్‌ అనూహ్య తిరుగుబాటుతో రష్యాలో చెలరేగిన ఆందోళన పరిస్థితులు సద్దుమణిగినట్టు కనిపించిన నేపథ్యంలో ప్రిగోజిన్ పై అమెరికా నిఘా సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పై తిరుగుబాటు ప్రకటించిన వాగ్నర్‌ అధిపతి ప్రిగోజిన్‌ కు ముప్పు పొంచి ఉందని.. ఆయన "తెరిచిన కిటికీల వద్ద జాగ్రత్త"గా ఉండాలని హెచ్చరించింది!

Tags:    

Similar News