మన్మోహన్ రికార్డును సమం చేసిన మోడీ

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రికార్డును తాజాగా సమం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.

Update: 2023-08-15 05:38 GMT

మరో రికార్డును క్రియేట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. కాంగ్రెసేతేర ప్రధానమంత్రులు ఎవరికి సాధ్యం కాని రికార్డుల్ని ఇప్పటికే బోలెడన్నింటిని తనతోనే మొదలు పెట్టిన ఆయన.. తాజాగా మరో రికార్డును పంద్రాగస్టు సందర్భంగా సమం చేశారు. దేశ ప్రధానిగా వ్యవహరిస్తూ వరుస పెట్టి పదిసార్లు పంద్రాగస్టు సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతీయ పతాకాన్నిఆవిష్కరించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రికార్డును తాజాగా సమం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.

కాంగ్రెసేయేతర ప్రధానుల్లో ఎవరికి సాధ్యం కాని ఈ రికార్డు.. ఈ రోజుతో సమమైది. వరుస పెట్టి పదిసార్లు పంద్రాగస్టు సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు మోడీ. ఆయనకు ముందుగా ప్రధానమంత్రిగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ వరుస పెట్టి పదిసార్లు జాతీయ పతాకాన్ని ఎగురవేయగా.. ఈ రోజు (మంగళవారం) పంద్రాగస్టు సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించటం ద్వారా అరుదైన రికార్డును సమం చేసిన ఘనత మోడీకి దక్కింది.

ఈ తరహా రికార్డును ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి తప్పించి.. మరే ఇతర పార్టీకి చెందిన ప్రధాని సాధించింది లేదు. ఇదిలా ఉండగా.. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు ఎర్రకోట నుంచి జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోడీ.. అనంతరం దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మధ్యతరగతి సొంతింటి కలను సాకారం చేసేందుకు కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లుగా ప్రకటించారు.

కొత్త ప్రపంచంలో భారత్ ను విస్మరించటం ఎవరి తరం కాదన్న మోడీ.. తమ ప్రభుత్వం తీసుకురానున్న కొత్తింటి పథకం గురించి ఆసక్తికర వ్యాఖ్య చేశారు. మధ్యతరగతి వారు తమ సొంతింటి కలను నెరవేర్చుకోవటానికి వీలుగా వారికి కొత్త పథకాన్ని తెస్తామన్నారు. ఇంటిపై తీసుకునేందుకు బ్యాంకు రుణాలపై రాయితీ ఇచ్చే కొత్త పథకానికి తాము శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. లక్షల్లో ప్రయోజనం కల్పించే ఈ పథకాన్ని త్వరలోనే ప్రకటిస్తామంటూ కొత్త ఊరింపును తెర మీదకు తీసుకొచ్చారు.

Tags:    

Similar News