మోడీ వర్సెస్ ఇండియా: సభలు ముగిశాయి.. సందేహాలు మిగిలాయి!
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి. జూలై 20న ప్రారంభమైన ఈ సమావేశాలు.. ఈ నెల 11న( శుక్రవారం)తో ముగిశాయి.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి. జూలై 20న ప్రారంభమైన ఈ సమావేశాలు.. ఈ నెల 11న( శుక్రవారం)తో ముగిశాయి. మొత్తం 17 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు.. ముగిసిపోయినా.. అనేక సందే హాలు మాత్రం అలానే మిగిలిపోయాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్సెస్ ఇండియా కూటమి మధ్య భారీ ఎత్తున యుద్ధం సాగుతుందని భావించిన ఈ సమావేశాలు ..నిజానికి అలానే సాగినా.. మోడీ మాత్రం తన పంథాను ఎక్కడా విడిచి పెట్టలేదు.
గతంలో జరిగిన సమావేశాల్లో అదానీ ఆస్తుల రగడ సహా.. బీబీసీ గుజరాత్ డాక్యమెంటరీపై విపక్షాలు పట్టు బట్టాయి. అప్పటికి ఇండియా కూటమిలేదు. అయితే.. అప్పట్లోనూ.. రోజూ విపక్షాలు సభలో ఆందోళనకు దిగాయి. ఎట్టకేలకు స్పందించిన మోడీ.. ఆ రెండు విషయాలు తప్ప.. అనర్గళంగా ఒక గంటా 45 నిమిషాల సేపు అప్పట్లో మాట్లాడారు. ఇక, ఇప్పుడు కూడా.. ఇలానే వ్యవహరించారు. ప్రతిపక్షాలు.. ఉభయ సభల్లోనూ తాజా భేటీలో మణిపూర్ అంశంపై సమాధానం చెప్పాలని నిలదీశాయి.
మణిపూర్ అల్లర్ల నేపధ్యంలో నిరసనగా ఇండియా కూటమి , ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాయి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా విఫలమయ్యాయో ప్రతిపక్షాలు తీవ్రంగా ఎండగట్టాయి . మణిపూర్లో జరిగిన అల్లర్లను దేశం మొత్తానికి తెలియజేయటానికే ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని మార్గంగా ఎంచుకున్నాయి . ప్రతిపక్షాలన్నీ మాట్లాడేసిన తర్వాత ఫైనల్ గా మోడీ జవాబిచ్చారు.
మామూలుగా అయితే ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలకు సమాధానం ఉంటుంది. అలాగే మణిపూర్లో జరిగిందేమిటి ? కేంద్రం తీసుకున్న చర్యలు తదితరాలను సమాధానం రూపంలో చెప్పాలి. కానీ మోడీ చేసిందేమంటే ఇండియా కూటమిని టార్గెట్ చేస్తు మాట్లాడారు. నెహ్రూ కాలం నుంచి ఇందిరమ్మ వరకు.. తర్వాత వచ్చిన ప్రభుత్వాల వరకు ఆయన ప్రస్తావించినా.. ఎక్కడా కూడా.. అసలు విషయంపై మాట్లాడలేదు. దేశం మొత్తం మణిపూర్‌కు దన్నుగా ఉంటుందని ఒక్క మాట అనేసి.. మిగిలిందంతా .. ఇండియా కూటమిపై విరుచుకుపడేందుకే సమయాన్ని వెచ్చించారు. సో.. మొత్తానికి సభలు ముగిశాయి.. కానీ సందేహాలు మాత్రం అలానే ఉండిపోయాయి.