లైక్.. షేర్.. సబ్ స్క్రైబ్ ప్లీజ్.. మోదీ ది యూట్యూబర్
టిటర్ (ఎక్స్), ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్.. ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం.. ఓ విధంగా వాట్సాప్ కూడా సోషల్ మీడియానే
టిటర్ (ఎక్స్), ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్.. ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం.. ఓ విధంగా వాట్సాప్ కూడా సోషల్ మీడియానే. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. సెల్ఫీ దిగి స్టేటస్ లో పెట్టామా? స్టోరీ రాసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశామా? రీల్స్ చేసి ఇన్ స్టాలో ఉంచామా? ట్రావెల్ వీడియోనో, కుకింగ్ వీడియోనో తీసి యూ ట్యూబర్ అవతారం ఎత్తామా..? ఇదే ప్రధానం అయిపోతోంది.
సంపాదన మార్గం కూడా
మనిషిని ముఖ్యంగా యువతకు వ్యసనంగా మారి వారి జీవితాలను ఛిద్రం చేస్తుందనేది సోషల్ మీడియా గురించి ఉన్న అపవాదు. అయితే, ఇందులో కొంతనే వాస్తవం ఉంది. నాణేనికి బొమ్మ బొరుసు ఉన్నట్లు సోషల్ మీడియాకూ రెండు కోణాలు ఉన్నాయి. దీనికి ఉదాహరణే.. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని కొందరు యువత సంపాదిస్తున్న తీరు. టెక్ చానెల్స్ ద్వారా, ట్రావెల్ చానెల్స్ ద్వారా వీరంతా ఆర్థికంగా ఎంతో ఎదిగారు. అటు తమ హాబీని తీర్చుకుంటూ ఇటు సంపాదన పరంగానూ ఆదర్శంగా నిలుస్తూ వస్తున్నారు.
నాయకుల చేతిలో సోషల్ మీడియా
ఓ పది పదిహేనేళ్ల కిందట సోషల్ మీడియా లేని రోజుల్లో ప్రధాన స్రవంతి మీడియానే నాయకులకు ఆధారం. ఇప్పుడదేమీ లేదు.. ప్రతి నాయకుడికి సొంతంగా ట్విటర్ ఖాతా ఉంది. ఇన్ స్టాలోనూ ఉన్న నాయకులున్నారు. కాగా, టెక్నాలజీ పెరిగిపోయిన ఈ రోజుల్లో అమెరికా నుంచి అమలాపురం వరకు నాయకులకు సమాచారం చేరవేయడానికి ట్విటర్ ఓ వేదికగా మారింది. కొందరు నాయకులైతే యూ ట్యూబ్ చానెళ్ల ఇంటర్వ్యూల ద్వారానే పాపులర్ అయిన సంగతి ఇక్కడ చెప్పుకోవాలి.
మోదీ.. ది సోషల్ మీడియా మ్యాన్
ప్రధాని మోదీ మీద ప్రతిపక్షాలు చేసే ప్రధాన ఆరోపణ.. మీడియాను ఎదుర్కొనలేరని. గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి మీడియాకు మోదీ చాలా దూరం. గుజరాత్ అల్లర్ల సమయంలో ఇంగ్లిష్ మీడియా ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరించిందనే ఆరోపణలున్నాయి. దీంతోనే ప్రధాని అయ్యాక కూడా మోదీ.. మీడియాను దగ్గరకు రానీయడం లేదు. ఎన్నో ఏళ్ల తర్వాత.. ఆయన ఇటీవల పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే, మోదీ సోషల్ మీడియాలో చురుగ్గానే ఉంటారు. ఆయన ట్విటర్ ద్వారా చేరవేస్తుంటారు. ఇక ఇప్పుడు మోదీ యూట్యూబ్ లోకీ వచ్చారు.
ప్లీజ్ సబ్ స్క్రైబ్ చేయండి..
సోషల్ మీడియా వచ్చాక దాదాపు ప్రతి ఒక్కరూ ఖాతా కలిగి ఉంటున్నారు. ఎక్కువ మంది యూట్యూబ్ చానెల్స్ కూడా తెరిచారు. వీరిలాగే ప్రధాని మోదీ కూడా యూ ట్యూబ్ చానెల్ ప్రారంభించారు. అంతేకాదు.. యూ ట్యూబార్ల నోటి నుంచి వచ్చే ''ప్లీజ్ లైక్.. షేర్.. సబ్ స్కైబ్'' అనే మాటలను మోదీ కూడా వాడుతున్నారు.
15 ఏళ్లుగా యూట్యూబ్ లో ఉన్నారట
మోదీ టెక్నాలజీని ఫాలో అవుతారా? అంటే ఔననే చెప్పాలేమో? మనందరికీ పదేళ్ల కిందట నుంచి మాత్రమే తెలిసిన యూట్యూబ్ ను ఆయన 15 ఏళ్ల కిందటి నుంచే వాడుతున్నారట. ఫ్యాన్ టెక్ ఇండియా సదస్సు ప్రారంభం సందర్భంగా ఆయనీ విషయం చెప్పారు. కాగా, తన చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోమని, పక్కనున్న గంట సింబల్ ను నొక్కమని కూడా కోరారు. 15 ఏళ్లుగా యూట్యూబ్ ద్వారా దేశానికి కనెక్ట్ అవుతున్నానని చెప్పిన మోదీ.. తాను కూడా మీలాంటివాడినే అని ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు.