నా జన్మ ధన్యమైంది... ప్రధాని మోడీ అమితానందం!

అవును... ఇస్రో ఛైర్మన్ విషయం చెప్పిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ అమితానందం వ్యక్తంచేశారు.

Update: 2023-08-23 14:56 GMT

నాలుగేళ్ల కిందట చివరి క్షణాల్లో చెదిరిన కలను ఎలాగైనా సాకారం చేసుకోవాలన్న పట్టుదలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జులై 14న చేపట్టిన చంద్రయాన్‌-3 గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఫలితంగా అంతరిక్ష చరిత్రలో ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించింది.

యావత్‌ భారత్ తో పాటు ప్రపంచం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఉద్విగ్న క్షణాల మధ్య చంద్రయాన్‌ - 3 చందమామపై అడుగుపెట్టింది. ఈ సమయంలో ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌ సోమ్‌ నాథ్‌ భారతి స్పందించారు. ఆన్ లైన్ లో వీక్షిస్తోన్న ప్రధానిని ఉద్దేశించి మాట్లాడారు.

"ప్రధాన్ మంత్రీ జీ నమస్కార్... సర్ వుయ్ ఆర్ అచీవ్డ్... సాఫ్ట్ లాండింగ్ ఆన్ ది మూన్... ఇండియా ఈస్ ఆన్ ది మూన్..." అని పలికిన అనంతరం ప్రధాని స్పందించారు!

అవును... ఇస్రో ఛైర్మన్ విషయం చెప్పిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ అమితానందం వ్యక్తంచేశారు. చంద్రయాన్‌ - 3 ప్రయోగాన్ని దక్షిణాఫ్రికా నుంచి వర్చువల్‌ గా వీక్షించిన ప్రధాని.. ఈ ప్రయోగం విజయవంతం అయిన వెంటనే జాతీయ జెండా రెపరెపలాడించారు. చప్పట్లతో అభినందించారు.

అనంతరం ఇస్రో శాస్త్రవేత్తల కృషిని అభినందించారు. ఇలాంటి చారిత్రిక ఘట్టాలు చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుందని అన్నారు. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశామని తెలిపారు. ఈ అద్భుత విజయం కోసం 140 కోట్ల మంది ప్రజలు ఎదురు చూశారని గుర్తుచేశారు.

ఇదే క్రమంలో ప్రపంచంలోనే తొలిసారిగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టాం అని సగర్వంగా చెప్పిన ప్రధాని... చంద్రయాన్‌ ఘన విజయంతో తన జీవితం ధన్యమైందని అన్నారు. తాను బ్రిక్స్‌ సమావేశాల్లో ఉన్నా.. తన మనసంతా చంద్రయాన్‌ పైనే ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా ఇప్పటివరకు చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి ఏ దేశమూ చేరుకోలేదని గుర్తుచేసిన ప్రధాని... మన శాస్త్రవేత్తల కఠోర శ్రమవల్లే ఈ విజయం సాధించగలిగామని ప్రకటించారు. ఇదే సమయంలో భారత్‌ సాధించిన ఈ అద్భుత విజయం ఒక్క మన దేశానిది మాత్రమే కాదని, మానవాళి అందరిదీ అని మోడీ తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News