'అమ్మ బంగారం'.. ఎక్కడైనా వివాదమే.. బ్రిటన్ రాజ కుటుంబంలోనూ
బ్రిటన్ రాజ కుటుంబం అంటే అంతులేని సంపదే కాదు.. అనేక వివాదాలు కూడా. అందుకే ఆ అంతఃపుర విషయాలు ఎప్పుడూ చర్చనీయాంశమే
సాధారణంగా భారతీయ కుటుంబాలు బంగారానికి అధిక విలువ ఇస్తాయి. ఇక ఆ ఇంట్లో ఆడబిడ్డలుంటే మరీనూ.. తల్లి ధరించిన బంగారం తదనంతరం కుమార్తెలకు ఇవ్వడం ఓ ఆనవాయితీగా వస్తోంది. ఇదంతా సజావుగా సాగితే సరి.. కుటుంబాల్లో ఆర్థిక వివాదాలు ఉంటే మాత్రం నానా రభస జరుగుతుంది. అయితే, మన దేశంలోనే కాదు ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఏలిన బ్రిటన్ రాజ వంశంలోనూ ఇదే పరిస్థితి ఉంది. అంటే ‘అమ్మ బంగారం’ ఎక్కడైనా వివాదాస్పదమే అన్నమాట.
ఆ డయానా..
బ్రిటన్ రాజ కుటుంబం అంటే అంతులేని సంపదే కాదు.. అనేక వివాదాలు కూడా. అందుకే ఆ అంతఃపుర విషయాలు ఎప్పుడూ చర్చనీయాంశమే. ఇప్పుడు బయటకు వచ్చినదాని ప్రకారం.. తన తల్లి ప్రిన్సెస్ డయానా ఇద్దరు (రా)కుమారులు విలియం, హ్యారీలు తమ తల్లి బంగారం విషయంలో గొడవ పడుతున్నారట. కాగా, అమ్మ డయానా ఉంగరాన్ని గతలోం విలియం కేట్ మిడిల్టన్ కు ఇచ్చి ప్రపోజ్ చేశాడు. ఇక హ్యారీ నటి మేఘన్ మెర్కెల్ ను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు డయానా ఆభరణాలను మెర్కెల్ ధరించకుండా విలియం అడ్డుకున్నాడంటూ ఓ రచయిత చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. హ్యారీ నటి మేఘన్ ను ప్రేమించడం కూడా రాజ కుటుంబానికి ఇష్టం లేదట. అక్కడే అన్నదమ్ముల మధ్య విభేదాలు మొదలైనట్లు చెప్పారు.
అమ్మ బంగారం నా భార్యకే..
మెర్కెల్ కు రాజ కుటుంబం పద్ధతులు, జీవన విధానం, సంప్రదాయాలు తెలిసేలా చేసి.. ఆ తర్వాత మీ ఇద్దరికీ పెళ్లి చేస్తామని హ్యారీకి విలియం ప్రతిపాదించాడు. కానీ, హ్యారీ దీనిని కాదని మెర్కెల్ ను పెళ్లాడాడు. ఈ పరిణామంతో అన్నదమ్ముల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. అంతేగాక మెర్కెల్ ను రాజ కుటుంబం సభ్యురాలిగా విలియం అంగీకరించలేదట. తన తల్లి, వేల్స్ యువరాణి దివంగత డయానా ధరించిన ఆభరణాలను తన భార్య కేట్ మిడిల్టన్ మాత్రమే వాడాలని విలియం బలంగా భావించాడట. కాగా, అన్నదమ్ముల్లో చిన్నవాడైన హ్యారీది కాస్త భిన్న స్వభావం. రాజ కుటుంబ సభ్యుడిగా ఎదుర్కొన్న అనుభవాలతో అతడు ‘స్పేర్’ పేరిట గత ఏడాది స్వీయ చరిత్ర రాశాడు. అందులో కుటుంబ సభ్యులు తననెప్పుడు స్పేర్ (అదనం)గానే చూశారంటూ సంచలన విషయాలు బయటపెట్టాడు. అన్న విలియంతో గొడవలనూ ప్రస్తావించాడు. మేఘన్ తో పెళ్లి విషయంలో కుటుంబంతో అభిప్రాయ భేదాలు వచ్చాయని.. ఆమెను వారు తీవ్రంగా వేదించారని చెప్పుకొచ్చాడు.