చర్లపల్లి జైలు ఖైదీ కడుపులో 9 మేకులు.. అసలేమైంది?
ఇనుప మేకుల్ని మించిన రిమాండ్ ఖైదీ ప్రాణాల మీదకు తెచ్చుకున్న వైనం.. చర్లపల్లి జైలు అధికారులకు హడలెత్తించింది
ఇనుప మేకుల్ని మించిన రిమాండ్ ఖైదీ ప్రాణాల మీదకు తెచ్చుకున్న వైనం.. చర్లపల్లి జైలు అధికారులకు హడలెత్తించింది. హటాత్తుగా తీవ్రమైన కడుపునొప్పితో విలవిలలాడుతున్న ఖైదీని హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో అతడికి శస్త్రచికిత్స జరిపిన వైద్యులు ఖంగుతిన్నారు. ఎందుకంటే.. అతడి కడుపులో ఏకంగా 9 ఇనుప మేకులు ఉండటంతో.. అతడి ప్రాణాలకు ప్రమాదం లేని విధంగా సర్జరీ చేసి కాపాడిన ఉదంతం గాంధీ ఆసుపత్రిలో చోటు చేసుకుంది.
చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు 32 ఏళ్ల మహ్మద్ షేక్. నాలుగు రోజుల క్రితం అతడికి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దీంతో.. అతడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతడ్ని స్కాన్ చేసిన వైద్యులు.. వెంటనే చికిత్స చేయాలని నిర్ణయించారు. గ్యాస్టో ఎంటరాలజీ హెడ్ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో దాదాపు గంట వరకు శ్రమించి.. అతడి కడుపులోని 9 మేకుల్ని విజయవంతంగా బయటకు తీశారు.
అతడి కడుపులో ఉన్న ఒక్కో మేకు రెండు నుంచి రెండున్నర అంగుళాల మేరకు ఉందని వైద్యులు చెప్పారు. కావాలనే ఈ మైకుల్ని మింగినట్లుగా చెబుతున్నారు. అందుకు దారి తీసిన కారణాలేమిటన్న దానిపై జైలు అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఉదంతం చర్లపల్లి జైల్లో సంచలనంగా మారింది.