ప్రియాంక ఇందిర రాజ్యం తెస్తారా ?
అచ్చం నాయనమ్మ పోలిక ఆమెను భారత దేశ రాజకీయాల్లో బలమైన నేతగా నిలబెట్టవచ్చు.
అచ్చం నాయనమ్మ పోలిక ఆమెను భారత దేశ రాజకీయాల్లో బలమైన నేతగా నిలబెట్టవచ్చు. అయితే దానికి ఆమె శక్తిసామర్ధ్యాలు మరింత రాణింపు అవసరం. ప్రియాంకా గాంధీ గురించే ఇదంతా. ఆమె కాంగ్రెస్ రాజకీయాలకు కొత్త అంటే కానే కాదు. ఆమె చాలా ఏళ్ళుగా తెర వెనక ఉంటూ తెర ముందుకు కూడా వచ్చి చాలా ఏళ్ళు అయింది.
ఆమె రాహుల్ గాంధీకు బ్యాక్ బోన్ గా ఉంటున్నారు. అన్న రాహుల్ గాంధీ తో పాటుగానే ఆమె కూడా తనదైన తీరులో రాజకీయాల్లో రాణిస్తూ వస్తున్నారు. తన తల్లి సోనియాగాంధీ గెలుపు కోసం 2019లో రాయబరేలో కలియతిరిగినా తన అన్న గెలుపు కోసం ఆమె 2024లో అంతే స్పూర్తితో పనిచేసినా ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాత్రమే.
ఇక యూపీలో కాంగ్రెస్ కి పునరుజ్జీవం తీసుకుని రావాలని ఆమె కొన్నాళ్ళ క్రితం తపన పడ్డారు. మొత్తం కార్యక్షేత్రాన్ని యూపీగానే చేసుకుని ఆమె తన వంతుగా కృషి చేశారు. అయితే దాని ఫలితాలు మాత్రం 2024 లోక్ సభ ఎన్నికల్లో కొంతవరకూ కనిపించాయి. 2019లో కోల్పోయిన అమేధీ కూడా ఈసారి కాంగ్రెస్ పరం అయింది. అయితే దానికి పొత్తులు కూడా మరో కారణం అని చెప్పవచ్చు.
ఇవన్నీ పక్కన పెడితే ప్రియాంక గాంధీ ప్రసంగాలు బాగానే ఇస్తారు. జనంలోకి చొరవగా చొచ్చుకుని పోతారు. ఆమెకు జనాకర్షణ శక్తి కూడా ఉందని తెలుస్తోంది. అయితే ఇవే కాదు రాజకీయం అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పాలుపంచుకోవాలి. ఆ విధంగా ఆమె ప్రజా ప్రతినిధిగా నెగ్గి తనను తాను రుజువు చేసుకోవాలి.
చట్ట సభలలో సైతం ఆమె తన టాలెంట్ ని చూపించాలి. అందుకే ఆమెను గతంలో అనేకసార్లు పోటీ చేయమని పార్టీ శ్రేణులు కోరాయి. అయితే షర్మిల అప్పట్లో పోటీకి దిగుతారు అని చివరి దాకా వినిపించినా కూడా అది అయితే జరగలేదు. ఆమె 2024 ఎన్నికల్లో రాయబరేలీ నుంచి పోటీ చేస్తారని కూడా చివరి దాకా వినిపించింది. అలా కాదు అమేధీ నుంచి ఆమె పోటీ చేస్తారు అని కూడా అనుకున్నారు. కానీ ఆమె ఇపుడు వయనాడ్ నుంచి పోటీ పడుతున్నారు. రాహుల్ గాంధీ రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది.
ఇక ప్రియాంకా గాంధీ ఈ సందర్భంగా వయనాడ్ లో నిర్వహించిన సభ కూడా బాగానే సాగింది. అన్న రాహుల్ గాంధీతో కలసి ఆమె వచ్చారు. పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఆమె విజయం మీద ఎవరికీ డౌట్లు లేవు. ఆ మీదట ఆమె చట్ట సభలలో అన్నకు తోడుగా ఏ విధంగా గళం వినీస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మరో వైపు చూస్తే ప్రియాంకా గాంధీ వయనాడ్ ఎంపీగా గెలిచిన తరువాత కాంగ్రెస్ లో సమూలంగా మార్పులు వస్తాయని అంటున్నారు.
అన్నతో పాటుగా ఆమె కూడా పార్టీని ముందుకు తీసుకుని వెళ్ళడంతో తన వంతు పాత్రను పోషిస్తారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఇప్పటిదాకా ఇందిరమ్మ రాజ్యం తెస్తామని రాష్ట్రాలలో కాంగ్రెస్ నేతలు అంటూ వచ్చారు. ఇపుడు ప్రియాంకా గాంధీ ఆ మాట అంటే జనాలు నమ్మే అవకాశం ఉంది. అంతే కాదు ఆమె కూడా నాయనమ్మ మాదిరిగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళగలిగే సత్తాను కలిగి ఉన్నారని నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది.