ప్రియాంకా గాంధీ పోటీ అక్కడి నుంచేనా?
వచ్చే ఎన్నికల్లో ప్రియాంకా పోటీ చేస్తే ఉత్తర ప్రదేశ్ నుంచి ఒకే కుటుంబం తరఫున ముగ్గురు పోటీ చేసే అవకాశం ఉంటుంది.
వచ్చే ఏడాది వేసవిలో లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల ప్రధాన ప్రతిపక్షాలన్నింటిని ఒక తాటిపైకి తెచ్చింది. 20కి పైగా పార్టీలతో ఇండియా పేరుతో కూటమి కట్టింది. బీజేపీని ఓడించడానికి తమ అస్త్రశస్త్రాలన్నింటికీ పదును పెట్టుకుంటోంది.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తురుపుముక్క దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ కూడా పార్లమెంటుకు పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. అందులోనూ ఆమె దేశంలో అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్ నుంచి బరిలోకి దిగుతారని అంటున్నారు. అలాగే ప్రియాంక గాంధీ.. ప్రధాని నరేంద్ర మోడీపై పోటీ చేయొచ్చని చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్ లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం వారణాసి ఎంపీగా ఉన్నారు. ఇక్కడ నుంచి తొలిసారి ఎంపీగా పోటీ చేసి 2014లో మోడీ విజయం సాధించారు. అలాగే రెండోసారి 2019లోనూ వారణాసి నుంచే భారీ మెజారిటీతో గెలుపొందారు. స్వయంగా నరేంద్రమోడీనే పోటీ చేయడంతో ఉత్తర ప్రదేశ్ అంతా సానుకూల ప్రభావం ఏర్పడి బీజేపీ అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు.
2024లోనూ ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ వారణాసి నుంచే పోటీ చేయొచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతారని అంటున్నారు. ప్రియాంక బరిలోకి దిగితే సమాజ్ వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీల మద్దతు కూడా ఆమెకే దక్కే అవకాశం ఉంది. మరోవైపు మహిళ కావడంతో మహిళలు పెద్ద ఎత్తున తనకు ఓట్లేస్తారని కాంగ్రెస్ అధిష్టానం లెక్కలు వేసుకుంటోందట.
మరోవైపు ప్రియాంక గాంధీ ముత్తాత జవహర్ లాల్ నెహ్రూ, నాయనమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ, తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ, బాబాయి సంజయ్ గాంధీ, పిన్ని మేనకా గాంధీ, బాబాయ్ కుమారుడు వరుణ్ గాంధీ ఇలా ప్రియాంక కుటుంబమంతా ఉత్తర ప్రదేశ్ నుంచే గతంలో ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ప్రియాంక కూడా తన కుటుంబ సభ్యుల బాటలోనే నడవటానికి సిద్ధమయ్యారని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో ప్రియాంకా పోటీ చేస్తే ఉత్తర ప్రదేశ్ నుంచి ఒకే కుటుంబం తరఫున ముగ్గురు పోటీ చేసే అవకాశం ఉంటుంది. రాయ్ బరేలి నుంచి సోనియా గాంధీ, అమేథి నుంచి రాహుల్ గాంధీ, వారణాసి నుంచి ప్రియాంక పోటీ చేస్తే అరుదైన రికార్డు అవుతుంది. అలాగే వీరి కుటుంబానికే చెందిన మేనకా గాంధీ, ఆమె కుమారుడు వరుణ్ గాంధీల్లో ఒకరు పోటీ చేయడం ఖాయం. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి.