పోలీసు ఉన్న స్విమ్మింగ్ పూల్ లో స్మగ్లర్ మూత్రం.. 'పుష్ప'పై మరో ఫిర్యాదు!
ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
'పుష్ప-2' సినిమా ఇప్పుడు తీవ్రస్థాయిలో రాజకీయ రంగు పులుముకుందని ఒకరంటే... ఇలాంటి సినిమాలను ప్రభుత్వాలు ప్రోత్సహించడం దారుణం అని మరొకరు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజు రోజుకీ ఈ సినిమాలపై విమర్శలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అవును... పుష్ప సినిమాపై ఇప్పటికే తీవ్ర వ్యాఖ్యలు చేసి, ఆ సినిమాకు జాతీయ అవార్డు రావడంపై విమర్శలు గుప్పించిన తీన్మార్ మల్లన్న... తాజాగా కీలక స్టెప్ తీసుకున్నారు. ఇందులో భాగంగా.. 'పుష్ప-2' సినిమాపై మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సినిమాలో కొన్ని సన్నివేశాలు పోలీసులను కించపరిచేవిగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న... ఇటీవలే థియేటర్ కు వెళ్లి "పుష్ప-2" సినిమా చూశానని.. ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలు దారుణంగా ఉన్నాయని విమర్శించారు. ప్రధానంగా పోలీసుల పట్ల చిన్నచూపు చుసే విధంగా ఉన్నాయని అన్నారు. వాటిపై ఫిర్యాదు చేస్తూ.. దర్శకుడు, నిర్మాత, హీరోపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రధానంగా... స్మగ్లర్ వచ్చి పోలీస్ ఆఫీసర్ కారును ఢీకొట్టి.. ఆ పోలీసు ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్ లో పడిన తర్వాత.. పూల్ లోనే మూత్రం పోయడం పోలీసులను అవమానించడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై దర్శకుడు సుకుమార్, నిర్మాత, సినిమా హీరో అల్లు అర్జున్ పై చర్యలు తీసుకోవాలని.. చట్టరీత్యా ఆ సీన్లను కట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో... స్మగ్లర్లను హీరోలుగా చూపిస్తే, అదే మార్గంలో నేటి యువత వెళ్తే అది సమాజాన్ని నాశనం చేయడం కాదా అని ప్రశ్నించారు. ఇటువంటి సినిమాలను ప్రోత్సహించకుండా మంచి సినిమాలను ప్రోత్సహించాలని.. పది మందికి ఉపయోగపడే సినిమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు.
దీంతో... ‘పుష్ప-2’ సినిమాపై మరో వివాదం నెలకొందనే చర్చ మొదలైంది. ఆ సన్నివేశంపై ‘పుష్ప-2’ టీమ్ ఎలాంటి వివరణ ఇస్తారు.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఈ సందర్భంగా వైరల్ గా మారింది.