సొరంగంలో సమస్య... ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది కానీ...!
లోపల ఉన్నవారు ఎప్పుడు బయటకు వస్తారా అని వారి వారి కుటుంబ సభ్యులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
సుమారు 13 రోజులుగా సొరంగంలో చిక్కుకుని ఉన్న కార్మికులను బయటకు తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఇంకా ఊరిస్తున్నే ఉన్నాయి. లోపల ఉన్నవారు ఎప్పుడు బయటకు వస్తారా అని వారి వారి కుటుంబ సభ్యులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో అంతర్జాతీయ స్థాయి టన్నెల్ నిపుణులను రప్పించారు. వారు రంగంలోకి దిగారు. దీంతో శుక్రవారం పని పూర్తయిపోతుందని భావించినా... మరళా విఘాతం ఏర్పడింది.
అవును... ఉత్తరాఖండ్ లోని ఉత్తర్ కాశీ సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలకు మళ్లీ విఘాతం ఏర్పడింది. గురువారం నాడు ఎదురైన వివిధ అవాంతరాలను అధిగమించిన అనంతరం శుక్రవారం ఎన్నో ఆశలతో డ్రిల్లింగ్ మొదలుపెట్టారు. అయితే ఈ పని మొదలుపెట్టిన కొద్దిసేపటికే ఆగర్ యంత్రానికి మరో లోహపట్టి అడ్డంకిగా నిలవడంతో పనులు నిలిచిపోయాయి.
కాగా కార్మికులు సొరంగంలో చిక్కుకుని 12 రోజులైన సంగతి తెలిసిందే. శిథిలాల్లో ఇనుపపట్టీ అడ్డుపడి, అనంతరం.. ఆగర్ మెషిన్ లో సాంకేతిక సమస్య తలెత్తి డ్రిల్లింగ్ పనులు నిలిచిపోయాయి. అయితే ఆ మెషిన్ ని బయటకు తీసి సరిచేసిన అనంతరం గురువారం రాత్రి బాగా పొద్దుపోయాక 25 టన్నుల భారీ డ్రిల్లింగ్ యంత్రాన్ని ఉంచిన వేదికకు పగుళ్లు ఏర్పడ్డటంతో పనులను నిలిపేశారు.
ఈ క్రమంలో వేదికను షాట్ క్రెటింగ్ ద్వారా పునరుద్ధరించి బలోపేతం చేసిన అనంతరం శుక్రవారం తిరిగి డ్రిల్లింగ్ మొదలుపెట్టారు. ఈసారి కూడా పనులు ఆగిపోయాయి. దీంతో... ఆశలురేపుతూ జోరుగా సాగిన డ్రిల్లింగ్ ప్రక్రియ రెండు రోజులపాటు నిలిచిపోయినట్లైంది.
మరోపక్క కార్మికులను పైపు ద్వారా బయటకు తీసుకొచ్చే ప్రక్రియకు సంబంధించిన ట్రయల్ రన్ ను ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలు విజయవంతంగా నిర్వహించాయి. ఇందులో భాగంగా 800 ఎంఎం వెడల్పు కలిగిన పైపు గుండా చక్రాలున్న స్ట్రెచర్ పై ఓ వ్యక్తిని ఉంచి లోపలికి పంపారు. అనంతరం దానికి కట్టిన తాడు సాయంతో బయటకు లాగారు. ఈ ప్రక్రియ విజయవంతంగా సాగింది.
దీంతో ఇప్పటి వరకూ 48.6 మీటర్ల మేర డ్రిల్లింగ్ జరగ్గా, 46.8 మీటర్ల వరకూ కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన 800 ఎంఎం వ్యాసం గల స్టీలు పైపుల ఏర్పాటు పూర్తయింది. ఇక లోపలున్న కార్మికులను చేరుకునేందుకు మరో 12 మీటర్ల పైపును అమర్చాల్సి ఉందని ఎన్.హెచ్.ఐ.డీ.సీ.ఎల్ ఎండీ వెల్లడించారు. దీంతో... శనివారం అయినా ఆశాజనకంగా ఉంటుందని అంతా ఆశిస్తున్నారు.
ఈ సమయంలో జరుగుతున్న పరిణామాలపై నీరసంగా స్పందిస్తూ, నిరాసగా వస్తున్న కామెంట్లపై జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్.డీ.ఎం.ఏ) సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నయిన్ స్పందించారు. "మనం చేస్తున్నది యుద్ధంలాంటిదే. ఖశ్చితంగా ఫలానా సమయంలోపు ఈ ఆపరేషన్ పూర్తియిపోతుందని.. అందర్నీ బయటకు తెస్తామని ముందుగానే జోస్యం చెప్పడం సరైన విధానం కాదు" అని వ్యాఖ్యానించారు.