భారీగా పెరిగిన ఎమ్మెల్యేల ఆస్తులు
మనదేశంలో రాజకీయ నేతల ఆస్తులు పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో 24 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆస్తులు 72 శాతం పెరగడం గమనార్హం.
మనదేశంలో రాజకీయ నేతల ఆస్తులు పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో 24 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆస్తులు 72 శాతం పెరగడం గమనార్హం. వీరితోపాటు ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆస్తులు కూడా ఇనుమడించాయి. వీరి ఆస్తులు 63 శాతం పెరిగాయి. నలుగురు ఎంఐఎం ఎమ్మెల్యేల ఆస్తులు 59 శాతం మేర పెరిగినట్లు తెలుస్తోంది. ఒక బీజేపీ ఎమ్మెల్యే ఆస్తులు 23 శాతం పెరిగినట్లు సమాచారం. ఇలా 32 మంది ఎమ్మెల్యేల ఆస్తులు సగటున 71 శాతం పెరిగినట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం ఎమ్మెల్యేల ఆస్తులు ఇంతలా పెరగడానికి కారణం వారికి వచ్చే వేతనాలే కావడం విశేషం. 2018తో పోలిస్తే వారి ఆస్తులు భారీగా పెరిగాయి. ప్రజాస్వామ్య సంస్కరణల వేదిక విడుదల చేసిన నివేదికలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఇటీవల ఎన్నికల బరిలో నిలిచిన 90 మంది ఎమ్మెల్యేల ఆస్తులు 3 నుంచి 1331 శాతం పెరిగాయి. 13 మంది ఎమ్మెల్యేల ఆస్తులు 79 శాతం తగ్గాయి.
2023 ఎన్నికల్లో పోటీచేసిన ఎమ్మెల్యేల సగటు ఆస్తుల విలువ 2018లో 14.44కోట్లు ఉండగా ప్రస్తుతం 23.87 కోట్లకు చేరాయి. అయిదేళ్లలో సగటు ఆస్తుల విలువ రూ.9.43 కోట్లు పెరగడం గమనార్హం. బీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆస్తుల పెరుగుదలలో ముందున్నారు. అప్పటి భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ఆస్తులు 2018లో రూ.91 కోట్లుగా చూపించారు. 2023లో 227 కోట్లుగా వెల్లడించారు. ఆయన ఆస్తులు 150 శాతం పెరిగాయి.
దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి ఆస్తులు గత ఐదేళ్లలో రూ.59 కోట్లు పెరిగాయి. 2018లో ఆయన రూ.20 కోట్లు చూపించగా 2023లో రూ. 79 కోట్లు చూపించారు. ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆస్తులు రూ.52 కోట్లు. 2018లో రూ.7 కోట్లు కాగా ప్రస్తుతం ఆయన ఆస్తులు రూ. 60 కోట్లు కావడం విశేషం. చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆస్తులు రూ. 606 కోట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన తరువాత స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 2018లో రూ.314 కోట్లుండగా 45 శాతం పెరగడంతో రూ.458 కోట్లకు చేరింది. తరువాత స్థానంలో రూ.438 కోట్లతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. 2018లో కేసీఆర్ ఆస్తులు 23 కోట్లుండగా 2023 నాటికి రూ.58 కోట్లకు పెరిగింది. కేటీఆర్ ఆస్తులు రూ. 41 కోట్ల నుంచి రూ. 53 కోట్లకు చేరింది. మంత్రి హరీష్ రావు ఆస్తులు రూ. 11 కోట్ల నుంచి రూ. 24 కోట్లకు చేరుకోవడం విశేషం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన వారి ఆస్తులు విపరీతంగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.