సర్వేలకు రేటు ఎంత...!?

నిజానికి ఈ సర్వే కల్చర్ అన్నది భారత దేశంలోనిది కాదు డెవలప్ అయిన దేశాలలో ప్రతీ అంశం మీద సర్వేలు చేస్తారు

Update: 2024-02-08 16:30 GMT

సర్వేలు అంటే జనాలు నమ్మడం జరుగుతూ ఉంటుంది. సర్వే చేసే సంస్థలకు చెందిన వారు చాలా కష్టపడి జనాల్లోకి వెళ్ళి మరీ పబ్లిక్ ఒపీనియన్ ని కలెక్ట్ చేస్తూ ఉంటారు అని భావిస్తారు. శాంపిల్స్ ఎన్ని అని పట్టించుకోకపోయినా ఎంతో కొంత గ్రౌండ్ లెవెల్ రియాలిటీ బయటకు వస్తుందని కూడా అనుకుంటారు. ప్రజల నోటి నుంచి అసలు మాటను చెప్పే సామర్ధ్యం సర్వేలకు ఉంటుందని కూడా అనుకుంటారు.

సర్వే ఫలితాలు అంటే సాదర జనాలకు కూడా ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. రాజకీయాల మీద ఇంటరెస్ట్ ఉన్న వారికైతే ఇంకా దాని మీద ఆసక్తి పెరుగుతుంది. సర్వేలు చూస్తే జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయి వరకూ ఇంకా లోకల్ లో చిన్న చిన్న ఏజెన్సీల వరకూ ఎప్పటికపుడు చేస్తూ ఉంటాయి.

నిజానికి ఈ సర్వే కల్చర్ అన్నది భారత దేశంలోనిది కాదు డెవలప్ అయిన దేశాలలో ప్రతీ అంశం మీద సర్వేలు చేస్తారు. అక్కడ సర్వేలకు ఒక నిబద్ధత ఉంది. ప్రజలు కూడా తమ అభిప్రాయాలను కుండబద్ధలు కొడతారు. దాంతో అక్కడ సర్వే రిపోర్టులు కరెక్ట్ గా వస్తాయి. ఇక దేశంలో సర్వేలు అంటే కూడికలు తీసివేతలుగా మారుతున్నాయి.

గత ఎన్నికల్లో ఎలా వచ్చింది అన్నది చూసుకుని బేరీజు వేసుకుని దాని మీద ఒకటి హెచ్చించడం లేక రెండు అంకెలు దించేయడమో చేసి సర్వేశ్వరులు అద్భుతమైన సర్వే వంటకాన్ని అయరు చేస్తున్నారు. ఇక సర్వేల తీరు కూడా ఇటీవల కాలంలో దారుణంగా మారింది. అది బ్రహ్మాండమైన మార్కెట్ గా మారిపోయింది. గత పదేళ్ళుగా దేశంలో ఎన్నికల వ్యూహకర్తలు బయల్దేరారు. వారితో పాటు సర్వేలు చేసేవారు ఎక్కడికక్కడ తామర తంపరగా పుట్టుకుని వచ్చేస్తున్నారు

సర్వేలు అన్నది ఒకపుడు ఎంతో కొంత నిజం ఉండేలా చూసుకునేవారు. ఇపుడు అలా కాదు వ్యూహకర్తలు రంగంలోకి దిగాక సర్వేలు ఫక్తు మైండ్ గేం గా మారుతున్నాయి. బలం ఉన్నా లేకపోయినా ఫలానా పార్టీ గెలుస్తుంది అని ముంచే ప్రచారం వీర లెవెల్ లో చేయడం ద్వారా గెలుపు గుర్రం వైపుగా జనాలను నడిపించడమే ఈ సర్వేల అసలు ఎత్తుగడ.

ఇక ఎన్నికల వ్యూహకర్తలు వచ్చాక సర్వేలు మొత్తం తేడాగా మారిపోయాయి అని అంటున్నారు. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఎప్పటికపుడు సర్వేలు చేయడం వదలడం చేస్తూ పోతున్నారు. అలా జనం బుర్రలలో ఆయా పార్టీ ఉండాలన్నదే వారి అజెండాగా ఉంది. ఇంకో వైపు చూస్తే ప్రముఖ సంస్థలు అని చెప్పుకునేవి ట్రాక్ రికార్డు గతంలో బాగున్న వాటిని తమ వైపునకు తిప్పుకుని పాజిటివ్ సర్వే నివేదికలను రాజకీయ పార్టీ తయారు చేయించుకుంటున్నాయి అన్న ఆరోపణలు ఉన్నాయి.

ఏపీలో చూస్తే వరసగా రెండు రోజుల వ్యవధిలో వచ్చిన రెండు సర్వేలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఒక సర్వే వైసీపీకి 19 ఎంపీ సీట్లు వస్తాయని చెబితే మరో సర్వే దానికి ఉల్టాగా టీడీపీ కూటమికి 17 ఎంపీలు అని పేర్కొంది. దీంతో ఏది కరెక్ట్ అన్నది తెలియక పార్టీ జనాలు సాదర జనాలు కూడా బుర్ర బద్ధలు కొట్టుకుంటున్నాయి. అసలు ఇంత నాసిరకంగా ఉంటున్న సర్వేలను ఎందుకు నమ్మాలి అని కూడా అంటున్నారు.

ఈ సర్వేలకు ఉన్న ప్రమాణం ఏమిటి, విశ్వసనీయత ఎంత అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీగా కొమ్ము కాస్తూ ఇచ్చే సర్వేలు జనాలను ప్రభావితం చేస్తాయనుకుంటే అసలుకే ఎసరు వస్తుంది అని కూడా అంటున్నారు. ఎందుకంటే జనాలు తెలివి మీరుతున్నారు. గతంలో సర్వేలను చూసి జనాలు నమ్మేవారు. ఇపుడు అయితే అలాంటి పరిస్థితి లేదు అని అంటున్నారు.

తాము లోకల్ అని తమకు అన్ని విషయాలూ తెలుసు అని ఎక్కడ నుంచో ఎవరో ఏవో నంబర్లు కాగితాల మీద వేసి అంకెల గారడీ చేస్తే లోకల్ గా ఉన్న జనాలు ఎందుకు మోసపోతారు అని అంటున్నారు. సర్వేలను ముందు పెట్టి మభ్య పెట్టి ఓడిపోతున్న పార్టీలను ఎవరూ గెలిపించలేరు. అలాగే గెలిచే పార్టీలను కూడా ఓడించలేరు అని అంటున్నారు.

దానికి కళ్ల ముందు ఇటీవల తెలంగాణాలో జరిగిన ఎన్నికలు సాక్ష్యం అంటున్నారు. ఇక సర్వేలకు రేట్లు కట్టి తమ కోసం సొంతంగా తయారు చేయించుకుంటూ వాటిని జనం మీదకు వండి వర్చుతున్న ఈ సర్వేలను చూస్తే రోత పుడుతోందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే సర్వేలకు కూడా కాలం చెల్లింది అంటున్నారు. అవుట్ డేటెడ్ మెథడ్స్ తో సర్వేలను చేసి జనాలను ఎల్లకాలం మోసగించలేరని అంటున్నారు. మొత్తానికి ప్రజలను మించిన సర్వేశ్వరులు ఉంటారనుకుంటే పొరపాటే కదా.

Tags:    

Similar News