పులస రావడం లేదు... ఎందుకో తెలుసా?
ఆస్థాయిలో ఫేమస్ అయిన పులస రాక సుమారు పదేళ్లుగా ఏటా తగ్గుతూ వస్తోన్న పరిస్థితి.
పులస చేప ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! ఇక గోదారోళ్లకైతే అస్సలు చెప్పక్కర్లేదు! ఏటా జూలై, ఆగస్టు నెలల్లో గోదావరి నదిలోకి వరస కట్టి.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని సీఫుడ్ ప్రియుల జిహ్వచాపల్యాన్ని తీర్చుతుంటాయి పులసలు. పుస్తెలమ్మి అయినా పులస తినాలనే నానుడి గోదావరి జిల్లాల్లో ఉందంటే.. దాని డిమాండ్ గురించి అర్ధం చేసుకోవచ్చు.
ఆస్థాయిలో ఫేమస్ అయిన పులస రాక సుమారు పదేళ్లుగా ఏటా తగ్గుతూ వస్తోన్న పరిస్థితి. ఈ సీజన్ లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలులో ఒక పులస మత్స్యకారులకు వలకు చిక్కింది. దాన్ని వేలం వేస్తే రూ.24 వేలకు పలికింది. దాని తర్వాత అక్కడక్కడా ఒకటో రెండో చిక్కినట్లు చెప్పుకున్నారు. అంతకు మించి ఈసారి పులస సందడి కనిపించలేదు.
ఇలా ప్రధానంగా గోదారోళ్లపై పులస అలిగినట్లు ఉన్న ఈ వ్యవహారంపై తాజాగా సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వాటర్ రీఛార్జ్ ఇనిస్టిట్యూట్ (సిఫ్రీ) ఓ అధ్యయనం నిర్వహించిందంట. దీనిలో పలు కీలక, షాకింగ్ విషయాలు వెల్లడైనట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... బంగాళాఖాతం నుంచి గోదావరి వైపు ఈ క్వీన్ ఆఫ్ ది ఫిష్ రావడం లేదని తేలిందని అంటున్నారు.
ఇలా హిందూ మహాసముద్రం నుంచి వేలాది కిలోమీటర్లు ఈదుకుంటూ బంగాళాఖాతంలోకి వస్తున్న పులసలు.. గోదావరి వైపు చూడకుండా.. పశ్చిమ బెంగాల్, ఒడిశా వైపు వెళ్తున్నాయని చెబుతున్నారు. పెరుగుతున్న కాలుష్యం, గోదావరి తీరం వెంబడి నెలకొన్న పలు ఆటంకాలే దీనికి కారణం అని స్పష్టం చేస్తున్నారు!
మరి వచ్చే ఏడాది అయినా ఈ పులస పులుసు తినే అదృష్టం దక్కుతుందా.. లేక, పులస అలక కంటిన్యూ అవుతుందా.. ఈ అవాంతరాలను దాటే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయా అనేది వేచి చూడాలి.
కాగా... గోదావరి వరద ప్రవాహం పోటెత్తి బంగాళాఖాతం వైపు పరుగులు తీసే రోజుల్లో... పునరుత్పత్తి కోసం ఇలసలు గుంపులు గుంపులుగా గోదావరిలోకి వలస వస్తుంటాయి. ఇలా ఏటికి ఎదురీదుతూ వచ్చే వీటినే పులస అంటారు! సముద్ర జలాల్లో ఉన్నప్పుడు వీటిని ఇలస అని పిలుస్తారు!