చిన్న విషయాలకే సంతృప్తి ఏల చిన్నమ్మా...?

బాగానే ఉంది కానీ వీటికే సంతృప్తి పడితే ఎలా చిన్నమ్మా అని అభిమానులు అభిమానులు అంటున్నారు. ఎన్టీఆర్ కి భారత రత్న అవార్డుని ఇప్పించేందుకు పురంధేశ్వరి కృషి చేయాలని కోరుతున్నారు.

Update: 2023-08-28 15:02 GMT

ఎన్టీఆర్ మహా నటుడు. అంతకు మించి మహా నాయకుడు. ఆయన అవినీతి చేసిన దాఖలాలు లేవు. ఆయన పక్కన చేరిన వారి అవినీతి వల్లనే ఆయన విమర్శల పాలు అయ్యారు. ఎన్టీఆర్ సినీ రాజకీయ జీవితం ఎవరో ఇచ్చినది కాదు, ఆయన కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కి సాధించినది. ఒక విధంగా చెప్పాలీ అంటే ఎన్టీఆర్ సెల్ఫ్ మేడ్ మాన్. ఆయన తరతరాలకూ స్పూర్తి.

అలాంటి ఎన్టీఆర్ సినీ జీవితం మూడున్నర పదులు అయితే రాజకీయ జీవితం ఒకటిన్నర పదులు. ఈ రెండింటిలోనూ ఎత్తు పల్లాలను ఆయన చూశారు. అలాగే అద్భుత విజయ శిఖరాలను సైతం అధిరోహించారు. ఎన్టీఆర్ అన్న మూడు అక్షరాలు నెవర్ టర్న్ రిటర్న్ అని ఆయన గురించి బాగా తెలిసిన వారు చెబుతారు.

ఎన్టీఆర్ ఉమ్మడి ఏపీలో ప్రాంతీయ పార్టీ పెట్టి జాతీయ స్థాయికి ఎదిగిన వారు. జయప్రకాష్ నారాయణ్ తరువాత విపక్షాలను ఏకత్రాటిపైన తెచ్చి నేషనల్ ఫ్రంట్ ని కేంద్రంలో అధికారంలోకి తీసుకుని వచ్చిన వారు ఆ ఒరవడి తరువాత కాలంలో ఎండీయే స్థాపనకు ఆనక యూపీయే ప్రతిష్టాపనకు కారణం అయింది.

అలా దేశ రాజకీయాలలో సంకీర్ణ శకాన్ని ముందుగానే ఊహించి అంతా కలసి కట్టుగా ఉంటూ ప్రజలకు మేలైన పాలన అందించాలని విభిన్నమైన సిద్ధాంతాలను కలిగిన పార్టీలను కలిపీన దార్శనీకుడుగా కూడా ఎన్టీఆర్ ని చూడాలి. అలాంటి ఎన్టీఆర్ దివంగతులై ఇప్పటికి 27 ఏళ్ళు నిండా గడిచాయి.

ఆయనకు భారత రత్న ఈ రోజుకీ కేంద్రం ప్రకటించలేదు. చాలా మందికి ఆ అవార్డు దక్కింది. కానీ ఎన్టీఆర్ కి మాత్రం ఆ గౌరవం లభించలేదు. దాని వెనక ఏ రాజకీయాలు ఉన్నాయో తెలియదు కానీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం అన్న గారికి భారత రత్న రావాలని మనసారా కోరుకుంటున్నారు. దానికి ఆయన నూరు శాతం అర్హుడని కూడా అంటున్నారు.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ విగ్రహం పార్లమెంట్ ఆవరణలో పెట్టారు. సంతోషం. ఆయనకు దక్కిన గౌరవంగానే భావించాలి. ఇన్నేళ్లకు ఆయన పేరిట ఒక వెండి నాణేన్ని కూడా రిజర్వ్ బ్యాంక్ ముద్రించింది. దాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఈ రెండూ కూడా తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయని కేంద్ర మాజీ మంత్రి బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ అయిన దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. తన తండ్రికి ఘన నివాళి అని ఆమె చెబుతున్నారు.

బాగానే ఉంది కానీ వీటికే సంతృప్తి పడితే ఎలా చిన్నమ్మా అని అభిమానులు అభిమానులు అంటున్నారు. ఎన్టీఆర్ కి భారత రత్న అవార్డుని ఇప్పించేందుకు పురంధేశ్వరి కృషి చేయాలని కోరుతున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీకి ఏపీ ప్రెసిడెంట్ ఆమె. ఆమె మీద కేంద్ర బీజేపీ పెద్దలకు నమ్మకం ఉండబట్టే ఏపీ బాధ్యతలను అప్పగించారు. ఎన్టీఆర్ లెగసీని తాము కూడా వాడుకోవాలని బీజేపీ చూస్తోంది అన్న చర్చ కూడా ఉంది.

ప్రధాని నరేంద్ర మోడీ సహా ఇతర కీలక నేతల నోట పలు మార్లు ఎన్టీఆర్ పేరు ప్రస్థావనకు వచ్చిన సంగతీ గుర్తు చేసుకోవాలి. అంతలా ఎన్టీఆర్ బీజేపీ వారికి కూడా ఇష్టుడైన వేళ ఆయనకు భారత రత్న ఇవ్వడం అన్నది పెద్ద సమస్య అయితే కాదని అంతా అంటున్నారు. ఆయన తనయగా పురంధేశ్వరి గట్టిగా పూనుకుంటే కచ్చితంగా అది జరిగి తీరుతుందని కూడా అంటున్నారు.

మరి ఎన్టీఆర్ కి అసలైన నివాళి భారత రత్న అవార్డు ఇవ్వడమే అన్నది అందరికీ తెలిసిన విషయం. ఈ విషయంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా కృషి చేస్తే కచ్చితంగా విజయవంతం అవుతారు అని అంటున్నారు. ఈ రోజున వెండి నాణెం మీద అన్న గారి బొమ్మ చూసి ఆనందించ జనం భారత రత్న బిరుదుతో బంగారు మనిషిగా అన్న గారిని తలచుకుని మురుసిపోతారనీ అంటున్నారు. మరి ఆ పనిచేస్తేనే అన్న గారికి సంపూర్ణ నివాళి అర్పించినట్లు.

Tags:    

Similar News