పురందేశ్వరికి మంగళవారమైనా విడుదల దొరుకుతుందా?

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీతో పొత్తుల విషయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

Update: 2024-02-26 13:32 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇక ఆలస్యం చేయడం ఏమాత్రం సరైన చర్య కాదని భావించారో.. లేక, మీరు లేకపోయినా జరిగేది జరగక మానదు అని బీజేపీ పెద్దలకు హింట్ ఇవ్వాలనుకున్నారో తెలియదు కానీ... టీడీపీ అధినేత చంద్రబాబు.. పవన్ ని పక్కన కుర్చోబెట్టుకుని ప్రస్తుతానికి 94 సీట్లలో టీడీపీ అభ్యర్థులు, మొత్తంగా 24 స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో... పురందేశ్వరిపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని అంటున్నారు.

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీతో పొత్తుల విషయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా తాను పూర్తిగా బీజేపీపై డిపెండ్ అవ్వలేదని చెప్పాలనుకున్నారో.. లేక, తాను పక్కన పెట్టిన 57 స్థానాల్లో పదో పరకో కావలనుకుంటే మరికొంత సమయం ఇస్తాను.. అప్పటికీ తేల్చకపోతే తన అభ్యర్థుల తుది ప్రకటన ఉంటుంది అన్నట్లుగా చెప్పాలనుకున్నారో కానీ... ఒక కీలక అడుగు అయితే వేశారు.

దీంతో అటు మీడియా ప్రతినిధులు, ఇటు సొంత పార్టీలోని నేతలు సైతం జనసేన - బీజేపీ పై అడుగుతున్న ప్రశ్నలకు పురందేశ్వరి సమాధానం చెప్పలేకపోతున్నారంట. పైగా... పవన్ కల్యాణ్ చంద్రబాబుతో వరుస భేటీలు, కలిపి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా టీడీపీ - జనసేన పొత్తులోనే ఉన్నాయంటు పురందేశ్వరి చెప్పుకునేవారు. దీంతో ఇప్పుడు వారిరువూ ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించిన వేళ పురందేశ్వరి పరిస్థితి మరింత ఇబ్బందిగా మారిందని అంటున్నారు.

ఇదే సమయంలో మరికొన్ని రోజులు ఆగితే... బీజేపీ కోసం వెయిటింగ్ లో పెట్టామన్నట్లుగా బాబు & కో ప్రకటించిన ఆ 57 స్థానాలకు కూడా అభ్యర్థులను కూడా ప్రకటించేస్తే... ఇక బీజేపీతో ఆ రెండు పార్టీల పొత్తుకు శుభం కార్డు పడినట్లే! వాస్తవానికి... టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే పోటీ చేయాలనేదే పురందేశ్వరి వ్యక్తిగత అభిప్రాయం అని అంటుంటారు. అలాకానిపక్షంలో ఏపీలో బీజేపీ జెండా కనిపించడం కష్టం అనేది ఆమె ఆఫ్ ద రికార్డ్ అభిప్రాయం అని చెబుతుంటారు.

ఈ సమయంలో జనసేనతో కలిసి చంద్రబాబు తొలిజాబితా అభ్యర్థులను ప్రకటించారు. మరోపక్క బీజేపీ అగ్రనేతలు రెస్పాండ్ కానట్లు కనిపిస్తున్నారు!! సరిగ్గా ఈ సమయంలో 27వ తేదీన అంటే మంగళవారం ఏలూరులో జరిగే పార్టీ కార్యక్రమంలో పాల్గొనటానికి కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ వస్తున్నారు. దీంతో... టీడీపీ - జనసేనతో బీజేపీ పొత్తుపై ఈయన అయినా ఏమన్నా క్లారిటి ఇస్తారా అని ఎదురుచూస్తున్నారట పురందేశ్వరి & కో!

వాస్తవానికి ఏపీ బీజేపీ వ్యవహారాలతో రాజ్ నాథ్ సింగ్ కి ఎటువంటి సంబంధం లేనప్పటికీ... ఆయన వచ్చేది హస్తిన నుంచి కావడంతో పొత్తు విషయంపై బీజేపీ పెద్దలు ఏదైనా కీలక అప్ డేట్ ఇచ్చి పంపుతున్నారేమో అని సగటు బీజేపీ కార్యకర్తతో పాటు వారికంటే ఎక్కువగా పురందేశ్వరి ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. మరి వీరంతా ఆశిస్తున్నట్లు చెబుతున్నట్లుగా పొత్తుకు సంబంధించి రాజ్ నాథ్ సింగ్ ఏమైనా కీలక విషయాన్ని వెల్లడిస్తారా.. లేక, పురందేశ్వరికి ఒత్తిడి నుంచి విడుదల లేకుండానే చేస్తారా అనేది వేచి చూడాలి!!

Tags:    

Similar News