రెండు యుద్ధాలు.. డొనాల్డ్ ట్రంప్.. ఒక నిర్ణయం..ఏ జరుగుతుంది?
ఇలాంటి సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వచ్చిన ఫలితం ప్రపంచ గమనాన్ని మార్చేదిగానే పరిగణించాలి.
రెండున్నరేళ్లుగా సాగుతోంది ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. 13 నెలలుగా జరుగుతోంది గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం.. వీటిలో దేనికీ ముగింపు కనిపించడం లేదు.. పైగా యుద్ధాలు మరింత విస్తరించే ప్రమాదం కనిపిస్తోంది. ఇజ్రాయెల్- హమాస్-హిజ్బుల్లా మధ్యలోకి ఇరాన్ ప్రవేశిస్తోంది. అటు ఉత్తర కొరియా సైనికులు రష్యా తరఫున ఉక్రెయిన్ లో యుద్ధానికి దిగుతున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వచ్చిన ఫలితం ప్రపంచ గమనాన్ని మార్చేదిగానే పరిగణించాలి.
‘స్నేహితుడు’ యుద్ధాన్ని ముగిస్తారా?
రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్నేహితుడు అనే సంగతి తెలిసిందే. 2016 అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని.. ట్రంప్ గెలుపునకు ఇది దోహదపడిందనే ఆరోపణలున్నాయి. అందుకనే పుతిన్ కు ట్రంప్ నకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అంటారు. ఇక 2020లోనూ ట్రంప్ గెలిస్తే ఎలా ఉండేదో కానీ.. ఓటమి పాలుకావడం చాలా ప్రభావమే చూపిందని చెప్పాలి. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్యను బైడెన్ నిలువరించలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. ఉక్రెయిన్ ను నాటోలో చేర్చుకోవడంపైనే రష్యా యుద్ధానికి దిగింది. కాగా, తాను అధికారంలోకి వస్తే రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి 24 గంటల్లో ముగింపు పలుకుతానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో గట్టిగా చెప్పారు. అంతేకాదు.. తాను గెలిచి వైట్ హౌస్ లోకి వెళ్లేలాగోనే గాజాలో యుద్ధానికి ముగింపు పలకాలని ఇజ్రాయెల్ కు ట్రంప్ స్పష్టం చేశారు.
ఎలాంటి పరిష్కారం చూపుతారో?
తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికే దిగేది కాదని అంటుంటారు ట్రంప్. మరి ఇప్పుడు ఆయనే ప్రెసిడెంట్ అయ్యారు. పైగా యుద్ధాలతో సమస్యలు పరిష్కారం కావనేది ట్రంప్ మాట. గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బహ్రెయిన్-ఇజ్రాయెల్-యూఏఈ మధ్య సంధి కుదిర్చిన ఘనత ట్రంప్ ది. 2020లో ఈ దేశాలను ఏకతాటిపైకి తెచ్చి ఒప్పందాలు కుదిర్చారు. దీనే ‘అబ్రహం సంధి (అబ్రహం అకార్డ్స్)’గా పిలుస్తారు. అందుకనే ట్రంప్ పై ఆశలు రేకెత్తుతున్నాయి.
నాటోను ఆపితే చాలు..
ఉక్రెయిన్ ను నాటోలో చేర్చుకోవడం అనే అంశంపైనే పుతిన్ ఆగ్రహించి యుద్ధానికి దిగారు. అంతేకాదు.. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ కు చేస్తున్న సాయంపై పుతిన్ గుర్రుగా ఉన్నారు. ఆయనతో మాట్లాడేంత చొరవ ఈ దేశాధినేతల్లో ఎవరికీ లేకపోయింది. ఇప్పుడు ట్రంప్ వచ్చారు కాబట్టి పుతిన్ ను మెల్లగా అయినా దారిలోకి తెస్తారేమో చూడాలి. కాగా, నాటోపై ట్రంప్ వైఖరి కాస్త ఆందోళన కలిగిస్తోంది. రక్షణ రంగంపై నిధులు ఖర్చుపెట్టాలని నాటో దేశాలను ట్రంప్ ఒత్తిడి చేస్తుంటారు. జీడీపీలో 2 శాతం రక్షణ బడ్జెట్లను పెంచుకోని దేశాలపైకి రష్యాను ఉసిగొల్పుతానని గతంలో స్వయంగా ట్రంప్ హెచ్చరించారు. నాటోలోని 31 దేశాల్లో 7 మాత్రమే ఇలా చేస్తున్నాయి. కాగా, నాటోలో ఉక్రెయిన్ చేర్చుకునే ప్రక్రియపై కాస్త వెనక్కుతగ్గినా పుతిన్ ను సముదాయించి యుద్ధాన్ని ఆపొచ్చు. ట్రంప్ ఆ పని చేస్తారేమో చూడాలి.