పుతిన్ కూ ఓ ఫ్యామిలీ.. మరి పిల్లలు? పారిస్ లో ఉన్నదెవరు?
పుతిన్ వ్యక్తిగత జీవితాన్ని అత్యంత రహస్యంగా ఉంచుతారని.. తన కుటుంబం గురించి బయట మాట్లాడరని పేర్కొంటారు.
ప్రపంచంలో ప్రస్తుతం ఐదారుగురు దేశాధినేతలే అందరికీ తెలుసని చెప్పాలి. వారిలో ఒకరు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ఉత్తర కొరియా అధినేత కిమ్. అయితే, వీరందరి కుటుంబాల గురించి ఏదో ఒక దశలో చర్చకు వచ్చింది. పుతిన్ ఫ్యామిలీ సంగతి మాత్రం ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. అసలు పుతిన్ కు వివాహమైందా..? ఎంతమంది పిల్లలు..? వారేం చేస్తున్నారు? వంటి వివరాలేవీ అంత త్వరగా బయటకు రాలేదు. పైగా పుతిన్ మాజీ గూఢచారి. అందుకని కూడా వివరాలను బయట పడకుండా జాగ్రత్త పడినట్లున్నారు. పుతిన్ వ్యక్తిగత జీవితాన్ని అత్యంత రహస్యంగా ఉంచుతారని.. తన కుటుంబం గురించి బయట మాట్లాడరని పేర్కొంటారు.
జిమ్నాస్ట్.. చరిత్రకారిణి
పుతిన్ రాజకీయ ధోరణులపైనే కాదు.. ఆయన ప్రేమ-పెళ్లిపైనా కథలు కథలుగా కథనాలు వచ్చాయి. చిత్రకారిణి ఎకటెరినా మిజులినాతో సన్నిహితంగా ఉన్నారని, రష్యా ప్రసిద్ధ జిమ్నాస్ట్ అలీనా కబయేవానూ పెళ్లి చేసుకున్నారనే ఊహాగానాలు వినిపించాయి. ఈమె ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ కూడా. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కవల కుమార్తెలు కూడా ఉన్నట్లు చెబుతారు. వీరి వివరాలను రహస్యంగా ఉంచినట్లు సమాచారం. లియుద్‌మిలాతో పుతిన్ కు ఇద్దరు కుమార్తెలున్నారు. అయితే లియుద్ తో విడిపోయారు.
పారిస్ లో ప్రవాసీగా..
ఇప్పుడు బయటకు వచ్చిన వార్త ప్రకారం.. పుతిన్ కుమార్తెల్లో ఒకరు ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో రహస్య జీవితం గడుపుతున్నారట. దీనిని బయటపెట్టింది ఎవరో కాదు.. రెండున్నరేళ్లుగా రష్యా యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ కు చెందిన టీవీ టీఎస్‌ఎన్. పుతిన్ కుమార్తె ఎలిజివెటా క్రివోనోగిఖా.. 21 ఏళ్ల ఈ యువతి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక దేశం విడిచి వెళ్లిందట. పైగా పారిస్ లో పేరు మార్చుకుని నివసిస్తోందని పరిశోధన కథనం ఇచ్చింది టీఎస్ఎన్.
పుతిన్ స్నేహితుడి కుమార్తెగా..
ఎలిజివెటా తనను పుతిన్ సన్నిహితుడు ఓలెగ్ రుద్నోవా కుమార్తె లిజాగా చెప్పుకొంటోంది. వాస్తవానికి ఎలిజివెటా రెండేళ్ల క్రితం వరకు సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి రెండు రోజుల ముందు దేశం విడిచి వెళ్లిందట. పైగా పారిస్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఆర్ట్స్ లో చదువుకున్న ఆమె తన ఇంటి పేరు ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో
వ్లాదిమిరోవానను ప్రస్తావించదట. పాస్ పోర్ట్ లో మాత్రం ఎలిజివెటా ఓల్గెవ్నా రుద్నోవా అనే పేరుంది.
తండ్రి పుతిన్.. తల్లి ఎవరు?
ఎలిజివెటా తల్లి పేర స్వెత్లానా. ఈమె రష్యాలోనే ఉంటున్నారు. సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తగా చెలామణి అవుతున్నారు. స్వెత్లానాకు పెద్ద బ్యాంకులో వాటాలతో పాటు.. సెయింట్ పీటర్స్ బర్గ్ లో స్ట్రిప్ క్లబ్ ఉందట. తల్లీకూతుళ్లు ఇద్దరూ తమ పేర్ల చివరి రుద్నోవా అనే పెట్టుకోవడం గమనార్హం.