క్రికెట్..సింధు కాబోయే భర్త గురించి ఈ విషయాలు తెలుసా?

భారత దిగ్గజ క్రీడాకారిణి.. స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు.

Update: 2024-12-03 06:00 GMT

భారత దిగ్గజ క్రీడాకారిణి.. స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. సోమవారం అనూహ్యంగా ఈ విషయం బయటకు వచ్చింది. భారతదేశానికి రెండు సార్లు ఒలింపిక్ పతకం అందించిన ఘనత.. ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ లో నంబర్ 2 స్థానానికి చేరిన అరుదైన రికార్డు.. మరెన్నో టెర్నీల్లో దేశానికి పేరు తెచ్చీన పీవీ సింధు వ్యక్తిగత జీవితంలో కలిసి నడిచే వ్యక్తి ఎవరు? అనే ఆసక్తి సహజం. పైగా సింధు భారత స్టార్ క్రీడాకారిణి కావడంతో.. ఆమె పెళ్లాడబోయేది తెలుగు అబ్బాయినేనా? అయితే ఎక్కడివారు? ఏం చేస్తుంటారు.? సింధు స్థాయికి తగిన వ్యక్తేనా? క్రీడాకారుడా? లేక అధికారుల కుటుంబం నుంచి వచ్చాడా? రాజకీయ వారసుడ? ఇలా అనేక ప్రశ్నలు.

స్పోర్ట్స్ ఫ్యామిలీలోకి..

పీవీ సింధు తండ్రి పూసర్ల వెంకటరమణ జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారుడు. 1986 ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గిన జట్టు సభ్యుడు. ఇక రమణ భార్య విజయ కూడా జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణే. వీరి పెద్ద కుమార్తె దివ్య డాక్టర్. ఈమె జాతీయ స్థాయి నెట్ బాల్ ప్లేయర్ కావడం గమనార్హం. అంటే సింధుది పూర్తిగా స్పోర్ట్స్ ఫ్యామిలీ. మరి ఇలాంటి కుటుంబంలోకి వస్తున్న వ్యక్తి ఎవరా? అని ఆరా మొదలైంది.

క్రికెట్.. ఇన్వెస్టింగ్..

హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వెంకటదత్త సాయితో సింధు పెళ్లి ఖాయమైంది. ఈ నెల 22న రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌ లో వీరి వివాహం జరగనుంది. 24న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ ఉంది. కాగా, వెంకటదత్త సాయి, సింధు కుటుంబాలు చాలాకాలంగా పరస్పరం పరిచయం ఉన్నవేనట. నవంబరులోనే వీరి పెళ్లికి సంబంధించి రెండు కుటుంబాలు నిర్ణయానికి వచ్చాయి. వివిధ టోర్నీలతో జనవరి నుంచి సింధు షెడ్యూల్‌ బిజీగా ఉండనుంది. దీంతో ఈ నెలలోనే పెళ్లి చేయనున్నారు. ఇక సింధు కాబోయే భర్త వెంకట దత్త సాయి పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌. ఆయన ఏంజెల్ ఇన్వెస్టర్. ఫ్లేమ్ యూనివర్సిటీ నుంచి ఆయన బీబీఏ 2018లో పూర్తి చేశారు. డేటా సైన్స్-మెషీన్ లెర్నింగ్ లో బెంగళూరు ట్రిపుల్ ఐటీ నుంచి మాస్టర్స్ చేశారు.

ఐపీఎల్ తోనూ అనుబంధం

వెంకట దత్త సాయికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తోనూ అనుబంధం ఉందట. లీగ్ లోని ఓ జట్టుతో కలిసి పనిచేశారట. అయితే, ఏవిధంగానో అనేది తెలియరాలేదు. ఒకవేళ డేటాసైన్స్ లేదా ఏంజెల్ ఇన్వెస్టింగ్ లో అయి ఉండొచ్చని సమాచారం.

Tags:    

Similar News