భారత్‌ లో ఈ ప్రదేశానికి యునెస్కో అరుదైన గౌరవం!

కాగా ఒక ఈశాన్య రాష్ట్రం నుంచి ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్న తొలి రాష్ట్రంగా అస్సామ్‌ నిలిచింది.

Update: 2024-07-27 11:30 GMT

భారత్‌ లోని అస్సాంలో ఉన్న అహోమ్‌ రాజవంశీకుల సమాధులకు అరుదైన గౌరవం లభించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన యునెస్కో టాయ్‌ అహోమ్‌ రాజవంశీకుల సమాధులను ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చింది. అస్సామ్‌ నుంచి ఇప్పటికే కజిరంగా నేషనల్‌ పార్క్, మానస్‌ నేషనల్‌ పార్కు యునెస్కో జాబితాలో ఉన్నాయి.

కాగా ఒక ఈశాన్య రాష్ట్రం నుంచి ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్న తొలి రాష్ట్రంగా అస్సామ్‌ నిలిచింది. మనదేశంలోని న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాలలో టాయ్‌ అహోమ్‌ రాజవంశీకుల సమాధులను వారసత్వ జాబితాలో చేర్చారు.

ఈజిప్టు పిరమిడ్ల తరహాలో అస్సాంలో ఉన్న పిరమిడ్ల వంటి మట్టి సమాధులను మోయిదమ్‌ అని పిలుస్తారు. దాదాపు 600 ఏళ్లపాటు అస్సాంను పాలించిన టాయ్‌–అహోం రాజవంశం తమ పూర్వీకులు ఎవరైనా మృతి చెందితే చరాయ్‌ దేవ్‌ లో మట్టితో పిరమిడ్‌ ఆకృతిలో నిర్మించిన దిబ్బలలో సమాధి చేసేది.

చరాయ్‌ దేవ్‌ మొయిదం సమాధులను 2023–2024 కింద యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం హోదాకు మనదేశం ప్రతిపాదించింది. ఈ సమాధులు 1228 నుండి దాదాపు 600 సంవత్సరాల పాటు అస్సాంను పాలించిన టాయ్‌ అహోమ్‌ రాజవంశానికి చెందినవి.

మొత్తం 52 ప్రదేశాలకు గానూ అస్సాంలోని అహోమ్‌ రాజవంశీకుల సమాధులను ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాకు భారత ప్రభుత్వం ఎంపిక చేసింది. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించడంతో మనదేశంలో ఈ హోదా పొందినవి.. 43కు చేరుకున్నాయి. మనదేశ ఈశాన్య ప్రాంతంలో తొలి ప్రపంచ వారసత్వ సంపద ఇదే కావడం గమనార్హం.

ఈ నేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోషల్‌ మీడియాలో ఆనందం వ్యక్తం చేశారు. ఇది అస్సాంకు గొప్ప విజయంగా అభివర్ణించారు. ఇందుకు కారణమైన ప్రధాని నరేంద్ర మోదీ, యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. చరాయ్‌ దేవ్‌ లోని మొయిదమ్స్‌ గొప్ప నాగరికత వారసత్వం, నిర్మాణ నైపుణ్యాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు.

అస్సాంలో కజిరంగా నేషనల్‌ పార్కు, మానస్‌ నేషనల్‌ పార్కు, ఇప్పుడు మొయిదమ్స్‌ (రాజవంశీకుల సమాధులు) ఉన్నాయని.. అద్భుతమైన అస్సాంను వీక్షించాలనుకునేవారు తప్పకుండా తమ రాష్ట్రానికి రావాలని హిమంత బిశ్వశర్మ కోరారు.

Tags:    

Similar News