ఉండిలో కూటమికి గుడ్ న్యూస్... బండెక్కిన ఆ ఇద్దరూ!

అయితే.. అనూహ్యంగా మంతెన రామరాజు నుంచి రఘురామ కృష్ణంరాజుకు మద్దతు దొరికింది. ఇద్దరు కలిపి ఉండి నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలతో హోరెత్తించేస్తున్నారు.

Update: 2024-05-03 05:05 GMT

అత్యంత రసవత్తరంగా మారిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యేకంగా కొన్ని నియోజకవర్గాలు అందరి దృష్టినీ ఆకర్షించే జాబితాలో ఉన్నాయి. వాటిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం ఒకటి. దానికి కారణం అక్కడ నుంచి కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి రఘురామ కృష్ణంరాజు బరిలోకి దిగడమే అనేది తెలిసిన సంగతే!

వాస్తవానికి గతంలో వైసీపీ తరుపున నరసాపురం లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన రఘురామ కృష్ణంరాజు.. అనంతరం ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంలా మారిపోయారు! సమయం ఏదైనా.. అంశం మరేదైనా.. ఏపీలో వైఎస్ జగన్ & కో లే లక్ష్యంగా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకానొక దశలో ప్రతిపక్షాలు అచేతన స్థితికి చేరిపోయినప్పుడు రఘురామ కృష్ణంరాజే ఆ పాత్రను సక్సెస్ ఫుల్ గా పోషించారని కూడా చెబుతుంటారు.

ఈ నేపథ్యంలో కూటమి తరుపున నరసాపురం ఎంపీ అభ్యర్థి తానే అని.. ఆ స్థానం కూటమిలో ఏ పార్టీకి దక్కినా అ టిక్కెట్ తనకే అని రఘురామ మొదట్లో ధీమాగా చెప్పేవారు! అయితే... ఆ స్థానం బీజేపీ ఖాతాలో పడటం.. ఆ పార్టీ రఘురామను పక్కనపెట్టి శ్రీనివాస్ వర్మకు టిక్కెట్ ఇవ్వడం.. తనను అకామిడేట్ చేయకపోతే ప్రజలు చంద్రబాబుని నమ్మరనే స్థాయిలో రఘురామ కామెంట్స్ చేయడంతో రాజకీయం రంజుగా మారిపోయిన పరిస్థితి!

దీంతో... రఘురామ స్థానిక అసెంబ్లీ నియోజకవర్గం ఉండి టిక్కెట్ ఇస్తారా అనే చర్చ తెరపైకి వచ్చింది. పైగా అప్పటికే కలవపూడి శివకు రెబల్ గా మారి ఉన్నారు! మంతెన రామరాజుకు టీడీపీ టిక్కెట్ దక్కింది. ఈ నేపథ్యంలో... మంతెన రామరాజుని కూడా కాదని రఘురామ టిక్కెట్ దక్కించుకున్నారు. దీంతో... ఇద్దరు రెబల్స్ మధ్య ఉండిలో రఘురామ ప్రయాణం అంత ఈజీ కాదనే కామెంట్లు వినిపించాయి.

అయితే.. అనూహ్యంగా మంతెన రామరాజు నుంచి రఘురామ కృష్ణంరాజుకు మద్దతు దొరికింది. ఇద్దరు కలిపి ఉండి నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలతో హోరెత్తించేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. రఘురామ కృష్ణంరాజు, మంతెన రామరాజు ఒకే బుల్లెట్ పై ప్రయాణిస్తూ కనిపించారు.

అవును... అనూహ్యంగా ఉండి టిక్కెట్ కోల్పోయిన రామరాజు - ఆ టిక్కెట్ అంతకంటే అనూహ్యంగా దక్కించుకున్న రఘురామ కృష్ణంరాజు ప్రచార కార్యక్రమాల్లో భాగంగా... ఇద్దరూ ఒకే బైక్ పై కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు స్థానికంగా వైరల్ గా మారింది. రఘురామకు ఒక సమస్య తీరిందనే కామెంట్లు ఈ సందర్భంగా తెరపైకి వస్తున్నాయి.

మరి అత్యంత రసవత్తరంగా జరుగుతున్న ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఉండిలో రఘురామ సత్తా చాటతారా లేదా అనేది వేచి చూడాలి. పైగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తనను స్పీకర్ గా చూడాలని చాలా మంది కోరుకుంటున్నారని ఇటీవల రఘురామ వ్యాఖ్యానించారు కూడా! మరి ఫైనల్ ఫలితం ఎలా ఉండబోతుందనేది వేచి చూడాలి!

Tags:    

Similar News