అన్నీ అయిపోయాయి.. ఇక ఈవీఎంల‌పై ప‌డిపోయిన రాహుల్‌

కేంద్రంలోని బీజేపీ స‌ర్కారును ఎదుర్కొనేందుకు భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టారు.

Update: 2024-03-31 15:07 GMT

కేంద్రంలోని బీజేపీ స‌ర్కారును ఎదుర్కొనేందుకు భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టారు. త‌ర్వాత‌.. భార‌త్ జోడో న్యాయ యాత్ర కూడా చేప‌ట్టారు. ఆసేతు హిమాచ‌లం తిరిగారు. ఇంత‌లో ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లువ‌చ్చాయి. కేవ‌లం ఒక్క తెలంగాణ‌లో మాత్ర‌మే అధి కారం ద‌క్కించుకున్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల‌ను కూడా కాంగ్రెస్ పోగొట్టుకుంది. ఇక‌, ఇప్పుడు ఆర్థికంగా ఉక్కిరి బిక్కిరికి గుర‌వుతోంది. ఈ నేప‌థ్యంలో బీజేపీపై చేస్తున్న దాడిని రాహుల్ గాంధీ కొత్త పుంత‌లు తొక్కించారు. అయితే..దీనిపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పార్టీల‌కు అతీతంగా రాహుల్‌ను త‌ప్పుబ‌డుతున్నారు.

ఇంత‌కీ రాహుల్ ఏమ‌న్నారు?

"ఈవీఎమ్‌లు లేకపోతే, మ్యాచ్ ఫిక్సింగ్ జరగకపోతే, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోకపోతే, మీడియాపై ఒత్తిడి చేయకపోతే బీజేపీ కనీసం 180 సీట్లు కూడా గెలుచుకోలేదు. ఐపీఎల్ మ్యాచ్‌లలో కేప్టెన్‌లను బెదిరించి మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్టు ప్రధాని మోడీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. అంపైర్‌లను ఆయనే ఎంపిక చేసి ప్లేయర్స్‌ని అరెస్ట్ చేయిస్తున్నారు. దేశంలో అతి పెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్‌లను ఫ్రీజ్ చేయించారు. మేం ప్రచారం చేయాలన్నా చిల్లిగవ్వ లేకుండా పోయింది`` అని రాహుల్ అన్నారు.

ఆర్థికంగా ఇబ్బందులు అనే మాట ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఈవీఎంల‌పై రాహుల్ చేసిన వ్యాఖ్య‌ల‌ను రాజ‌కీయాల‌కు అతీతంగా అంద‌రూ ఖండిస్తున్నారు. ఎందుకంటే ఈవీఎం వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చింది.. కాంగ్రెస్ పార్టీనే. ఆ త‌ర్వాత‌.. దీనిపై విమ‌ర్శ‌లు వ‌చ్చిన‌ప్పుడు.. అంతా ప‌ర్ ఫెక్ట్ అని స‌ర్టిపికెట్ ఇచ్చుకున్న‌ది కూడా కాంగ్రెస్ పార్టీనే. పోనీ.. సుప్రీంకోర్టు,ఎన్నిక‌ల సంఘాల్లో వేసిన ఫిర్యాదుల స‌మ‌యంలో కూడా కాంగ్రెస్‌కు ఉప‌శ‌మ‌నం ద‌క్క‌లేదు. మొత్తంగా ఈవీఎంల‌పై.. ఇబ్బంది లేద‌ని కూడా సుప్రీం స‌హా ఈసీ కూడా తేల్చి చెప్పింది. ఇంత జ‌రిగిన త‌ర్వాత‌.. ఈవీఎంల‌పై ప‌డ‌డం రాహుల్‌ను మ‌రింత డ్యామేజీ చేసింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News