వీడియో వైరల్... పోస్టర్ పట్టుకున్న రాహుల్.. తలపట్టుకున్న నిర్మలమ్మ!
రాహుల్ గాంధీ.. తాజాగా ఈ రోజు లోక్ సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై విమర్శలు గుప్పించారు!
గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఫుల్ దూకుడుమీద కనిపిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో మొద్దబ్బాయిగా విమర్శలు ఎదుర్కొన్న రాహుల్.. పార్లమెంట్ లో అధికారపక్షాన్ని అల్లల్లాడిస్తున్నారనే స్థాయికి చేరుకున్నారని అంటున్నారు. ఈ సమయంలో తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై రాహుల్ గాంధీ మండిపడ్డారు.
అవును... గతకొంతకాలంగా ఫుల్ ఫామ్ లో ఉన్నట్లు కనిపిస్తున్న రాహుల్ గాంధీ.. తాజాగా ఈ రోజు లోక్ సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై విమర్శలు గుప్పించారు! ఇందులో భాగంగా... కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం మిత్రపక్షాలను ప్రసన్నం చేసుకొవడానికే అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. అనంతరం ఈ బడ్జెట్ ను "కుర్చీ బచావో" బడ్జెట్ గా అభివర్ణించారు.
ఇదే సమయంలో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో నుంచి ఈ బడ్జెట్ ను కాపీ చేశారని ఆరోపించారు. ఏఏ (అంబానీ - అదానీ)కి మాత్రమే ప్రయోజనం కలిగించేలా, సామాన్య భారతీయులకు ఉపశమనం దక్కకుండా.. దళిత, ఆదివాసీ, ఓబీసీల ప్రస్థావనే లేకుండా ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టారని మండిపడ్డారు.
ఇదే క్రమంలో... బడ్జెట్ ప్రవేశపెట్టే మందు నిర్మాలా సీతారామన్ "హల్వా" వేడుకలో పాల్గొన్నారంటూ ఓ ఫోటోను సభలో ప్రదర్శించే ప్రయత్నం చేశారు రాహుల్. అయితే... సభలో పోస్టర్స్ ప్రదర్శించడానికి అనుమతి లేదంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ చేస్తున్న కామెంట్స్ కి నిర్మలా సీతారామన్ తలపట్టుకుని బాదుకుంటున్నట్లు కనిపించారు!
దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీనికి ఒక్కొక్కరూ ఒక్కో భావానువాదం చేస్తున్నారు. రాహుల్ గాంధీ అపరిపక్వత చూసి నిర్మలమ్మ తలబాదుకుంటున్నారని ఒకరంటే... రాహుల్ ఈ స్థాయిలో కడిగిపారేస్తుంటే ఏమి చెయ్యాలో తోచక, అడ్డుచెప్పలేక ఆమె అలా తలపట్టుకున్నారని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు.
ఇదే సమయంలో... మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు.. తమ పార్టీ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోకు ఈ బడ్జెట్ కాపీ అంటూ కామెంట్లు చేశారు. ఇందులో భాగంగా... ఎన్నికలు తర్వాత గౌరవనీయులైన ఫైనాన్స్ మినిస్టర్.. కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోను చదివినందుకు, అందులో 30వ పేజీలో పేర్కొన్న ఉపాధి-సంబధిత ప్రోత్సహకాన్ని ఆమె స్వీకరించినందుకు సంతోషిస్తున్నట్లు చిదంబరం ఎక్స్ లో పేర్కొన్నారు.