రాహుల్ తేల్చేశారు : బీజేపీకి పది శాతం కాంగ్రెస్ కి తొంబై శాతం !

ఇక తొంబై శాతం మందికి కాంగ్రెస్ అండగా ఉంటుందని వారంతా తమ వారు అన్నట్లుగా క్లెయిం చేసుకుంటున్నారు.

Update: 2024-08-25 09:40 GMT

కాంగ్రెస్ అగ్ర నేత లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ దేశంలోని మొత్తం జనాభాలో బీజేపీకి జస్ట్ పది శాతం మాత్రమే మద్దతు ఉందని తేల్చేశారు. ఇక తొంబై శాతం మందికి కాంగ్రెస్ అండగా ఉంటుందని వారంతా తమ వారు అన్నట్లుగా క్లెయిం చేసుకుంటున్నారు.

కుల గణన అన్న ఒక కార్డుని పట్టుకున్న రాహుల్ గాంధీ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ముప్ప తిప్పలు పెడుతున్నారు. దేశంలో ఎన్డీయే ప్రభుత్వం పది శాతం వర్గాల మీదనే దృష్టి పెడుతోందని తొంబై శాతాన్ని పట్టించుకోవడం లేదని రాహుల్ చాలా తెలివిగా కొత్త వాదనను లేవదీస్తున్నారు. కుల గణన జరిపితే దేశంలోకి ఆయా కులాలకు ఆర్థిక సామాజిక రాజకీయ అవకాశాలు ఇంతకు రెట్టింపు పెరుగుతాయని రాహుల్ అంటున్నారు.

ఆ విధంగా ఆయా వర్గాలలో కొత్త ఆశలను చిగురింపచేస్తున్నారు. కుల గణన చేపట్టి తీరాల్సిందే అని ఆయన చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ఎక్కడా తగ్గేదే లే అని చెబుతున్నారు. తాము నూటికి తొంబై శాతం ఉన్న వర్గాల కోసం ఆలోచిస్తున్నామని రాహుల్ చెబుతున్నారు. బీజేపీ మాత్రం నూటికి పది శాతం వారి గురించే ఆలోచిస్తోందని అతి పెద్ద విభజన గీత గీసిన రాహుల్ మొత్తం దేశంలోని బహుజన సమాజాన్ని తన వైపుగా తిప్పుకునే ప్లాన్ చేశారు.

కులగణన జరిపించేందుకు బీజేపీ ఒప్పుకుంటే ఆయా వర్గాల వైపు చూసినట్లు అన్నట్లుగా రాహుల్ వాదన ఉంది. దీంతో బీజేపీ పూర్తిగా ఇరకాటంలో పడుతోంది. వాస్తవంగా చూస్తే కనుక కుల గణనపై రాహుల్ గాంధీ పట్టుదలతో ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇదే ఆయన ఇదే తన ప్రధాన ప్రచార అంశంగా ఎంచుకున్నారు. అంతే కాదు ఇటీవల ముగిసిన లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై చర్చలో పాల్గొన్న సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన తన వ్యాఖ్యల సమయంలో కూడా బహుజన కులాలు అగ్ర కులాలు అన్న వాదనను వినిపించారు.

ఇదంతా రాహుల్ చాలా వ్యూహాత్మకంగానే చేస్తున్నారు అని భావించాలి. బీజేపీ హిందూత్వ నినాదానికి గండి కొట్టేందుకు పూర్తి స్థాయిలో మండల్ కార్డుని తీయడం ద్వారా కమండల్ రాజకీయాలకు చెక్ పెట్టేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు అని అర్ధం అవుతోంది.

ఈ విధంగా మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ బహిరంగంగా కుల గణన పేరుతో చాలా కులాలకు కాంగ్రెస్ ఆలంబనగా నిలుస్తుందని చాటి చెబుతున్నారు. నిజానికి ఈ దేశ జనాభాలో దాదాపు 90 శాతం ఉన్న దళితులు, ఆదివాసీలు, ఇతర వెనుకబడిన తరగతులు మైనారిటీలు ఉన్నారు.

కుల గణన పేరిట చేసే సర్వేలు తీసే లెక్కలతో ఆయా కులాల బలం ఎంత జనాభా ఎంత అన్నది బయటపడుతుంది. ఆ మీదట వారికి అన్ని రంగాలలోనూ వాటా ఇవ్వాల్సిన అవసరం జనాభా ప్రాతిపదికన ఉంటుందని రాహుల్ వాదిస్తున్నారు. ఇదంతా ఆయా కులాల మేలుకు వారి అభ్యున్నతికి అని ఆయన చెబుతున్నారు.

దీంతో ఆయా కులాలు సహజంగానే రాహుల్ వాదనతో ఏకీభవిస్తాయి. ఎందుకంటే వారికి ఎంతో మేలు చేకూర్చే వాదన ఇది కాబట్టి. అయితే బీజేపీ కుల గణన విషయంలో ఏమీ చెప్పలేని స్థితిలో ఉంది. కుల గణన అంటే విచ్చిన్నమే అన్న ధోరణిలో హిందూత్వ వాదులు ఉన్నారు. మతం ప్రాతిపదికన ఇంతకాలం రాజకీయం చేస్తున్న బీజేపీని కులం కార్డుతో కొట్టాలని రాహుల్ తీసుకున్న ఈ నిర్ణయం అంతకంతకు కమలం పార్టీలో కలవరం పెంచే లాగానే ఉంది.

ఒక విధంగా చూస్తే కుల గణన జరిగితే దేశంలో కులాల చిచ్చు రాజుకుంటుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. అయితే కులాలకు సమ న్యాయం జరుగుతుందని తద్వారా వారికి ఈ దేశంలో అవకాశాలు పెరుగుతాయని కాంగ్రెస్ వాదిస్తోంది. మరి ఈ క్రమంలో బీజేపీ కేవలం పది శాతం మంది ప్రయోజనాల కోసమే పనిచేస్తోంది అంటూ రాహుల్ సంధిస్తున్న బాణాలు బీజేపీకి గట్టిగానే తగులుతున్నాయి.

చూడబోతే మూడున్నర దశాబ్దాల క్రితం మండల్ కమిషన్ సిఫార్సులను బయటకు తీసి అమలు చేసేందుకు అనాటి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వ ప్రధాని వీపీ సింగ్ చేసిన ప్రయత్నం తరహాలోనే రాహుల్ గాంధీ ఈ రోజు బీజేపీని కట్టడి చేస్తున్నారు అని అంటున్నారు. తొందరలో నాలుగు అసెంబ్లీలకు ఎన్నికలు ఉన్న వేళ రాహుల్ మరింతగా కుల గణన మీద డిమాండ్ చేస్తూ ఎన్నికల సభలలో పాల్గొంటారు అని తెలుస్తోంది. దీనికి విరుగుడు మంత్రం బీజేపీ వద్ద ఉందా లేదా అన్నదే కీలకమైన ప్రశ్న.

Tags:    

Similar News