పప్పు వర్సెస్ పడిలేచిన కెరటం!
అంతేకాదు రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలినాళ్లలో ఆయన ‘పప్పు’ అని అవహేళన కూడా చేశారు
రాహుల్ గాంధీ.. ‘యువరాజు’ అని బీజేపీ నేతలు ఆయనపై చేసే విమర్శ. అంతేకాదు రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలినాళ్లలో ఆయన ‘పప్పు’ అని అవహేళన కూడా చేశారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు ముని మనుమడు, దివంగత ప్రధాని ఇందిరాగాంధీకి మనుమడు, మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీకి కుమారుడు అనే అర్హతలు తప్ప రాహుల్ గాంధీకి ఏ అర్హతలు లేవని బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. దేశ సమస్యలపై ఆయనకు ఏ అవగాహన లేదని హేళన చేశారు.
అయితే పడిలేచిన కెరటంలా రాహుల్ గాంధీ దూసుకొచ్చారు. 2007లో ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు కృషి చేశారు.
2004లో తొలిసారి తమ కుటుంబ కంచుకోట ఉత్తరప్రదేశ్ లోని అమేథి నుంచి ఎంపీగా రాహుల్ విజయం సాధించారు. 2009, 2014లోనూ వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు.
ఈ క్రమంలో 2009 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ చేసిన ప్రచారం ఆ పార్టీ విజయానికి బాటలుపరిచింది. దీంతో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వం కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది.
అయితే 2019లో రాహుల్ విజయానికి బ్రేకులు పడ్డాయి. అమేథిలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేయడంతో అక్కడి నుంచి ఎంపీగా గెలుపొందారు.
ఈ క్రమంలో 2014, 2019ల్లో బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టడంతో రాహుల్ గాంధీ వల్ల కాదని.. ప్రధాని మోదీ ఆకర్షణకు ఆయన సరితూగరనే విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ లో కీలక నేతలుగా ఉన్న జ్యోతిరాధిత్య సింధియా, నవీన్ జిందాల్, జితిన్ ప్రసాద్, గులాంనబీ ఆజాద్ వంటివారు పార్టీని వీడిపోయారు. వీరిలో ఆజాద్ మినహాయించి మిగతావారంతా బీజేపీలో చేరిపోయారు.
అయితే రాహుల్ గాంధీ ఎక్కడా తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. తన తల్లి సోనియాగాంధీ వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో ఉండటంతో పార్టీకి నాయకత్వం వహించాల్సిన బాధ్యత రాహుల్ పైనే పడింది.
ఈ క్రమంలో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేపట్టారు. దేశ దక్షిణాదిన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ఉత్తరాదిన జమ్ముకాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు. కూలీలు, కార్మికులు, వలస కూలీలు, రైతులు, విద్యార్థులు, వృద్ధులు, ఉద్యోగులు, లారీ, ట్రక్ డ్రైవర్లు ఇలా అన్ని వర్గాల వారితో రాహుల్ మమేకమయ్యారు. పటిష్ట భద్రతను కూడా తోసిరాజని ఆయన సామాన్య ప్రజలతో మమేకమయ్యారు.
రాహుల్ భారత్ జోడో యాత్ర సత్ఫలితాలను ఇచ్చింది. అప్పట్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో 25 రోజులపాటు అక్కడే ఆయన జోడో యాత్ర నిర్వహించారు. రాహుల్ ప్రభావంతో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. పటిష్ట బీజేపీని ఓడించింది.
కర్ణాటక నుంచి రాహుల్ భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. అక్కడ కూడా జోడో యాత్ర ప్రభావంతో పోటీలో లేదనుకున్న పార్టీని ముందుకు తెచ్చారు. బీఆర్‌ఎస్, బీజేపీలను ఓడించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టేలా చేయడంలో రాహుల్ గాంధీ జోడో యాత్ర కీలక పాత్ర పోషించింది.
భారత్ జోడో యాత్ర ద్వారా వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ అంతటితో ఆగలేదు. ఈసారి జాతుల మధ్య ఘర్షణలకు కారణమైన మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు న్యాయ్ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈశాన్య భారతదేశం నుంచి మొదలుపెట్టి పశ్చిమ భారతదేశం వైపు తన యాత్రను కొన సాగించారు. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. 68 సీట్లు ఉన్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లను గెలుచుకుని అధికారంలోకి వచ్చింది.
ఇలా గాంధీ కుటుంబ వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాహుల్.. తనదైన మార్క్‌తో దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా మారారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాని పదవికి పోటీ పడకుండా చాకచక్యం చూపారు. ప్రధాన ప్రాంతీయ పార్టీలయిన ఆమ్ ఆద్మీ, సమాజవాదీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (పవార్), శివసేన (ఉద్ధవ్ థాకరే), డీఎంకే, తదితర పార్టీలతో కలిసి కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంతో రాహుల్ కీలకపాత్ర పోషించారు.
తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్, సర్వేలన్నీ బీజేపీ సొంతంగా మెజార్టీ సాధిస్తుందని చెప్పాయి. ఇండియా కూటమి కుదేలవుతుందని తేల్చాయి. అయినా నిరాశ కోల్పోకుండా ఇండియా కూటమిని రాహుల్ గాంధీ నడిపించారు. ఇండియా కూటమి లోక్ సభలో 240 సీట్లు సాధించి ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసింది. రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లోనూ రెండుసార్లు బరిలోకి దిగి రెండు చోట్లా భారీ మెజార్టీలతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అంచనాలను మించి సొంతంగా 99 స్థానాలు సాధించింది.
ఈ ఎన్నికల్లో రాహుల్ ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలి, కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసి రెండు చోట్లా 3 లక్షలకుపైగా మెజార్టీలతో విజయ ఢంకా మోగించారు. కేంద్రంలో మరో 32 సీట్లు ఇండియా కూటమికి వచ్చి ఉంటే కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి ఉండేది. రాహుల్ క్రియాశీలక పాత్ర పోషించేవారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీలకు 1970, జూన్ 19న రాహుల్ గాంధీ జన్మించారు. నేడు (జూన్ 19) ఆయన 54వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గానే ఉన్న రాహుల్ తన లక్ష్యాలను చేరుకోవడానికి వడివడిగా అడుగులేస్తున్నారు.