వైరల్‌.. 'టీ తాగితే మైండ్‌ ఫ్రెష్‌ అవుతుంది.. రాహుల్‌ గాంధీ వస్తే దేశం ఫ్రెష్‌ అవుతుంది'!

ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ అభిమాని ఒకరు ఏర్పాటు చేసిన టీ స్టాల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. వరంగల్‌ జిల్లా ఖాజీపేటలో దీన్ని ఏర్పాటు చేశారు.

Update: 2023-08-19 18:46 GMT

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించి దూకుడు మీదున్న కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలోనూ అధికారంలోకి రావడానికి సర్వసన్నద్ధమవుతోంది. పార్టీ అగ్ర నేతలంతా విభేదాలు వీడి సమైక్యంగా అడుగులేస్తుండటంతో ఆ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తోంది. మరోవైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా చేరడంతో కాంగ్రెస్‌ పార్టీలో జోష్‌ నెలకొంది.

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకలు తెలంగాణలో పర్యటించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీరిద్దరితోపాటు సోనియా గాంధీ సైతం తెలంగాణను చుట్టేస్తారని అంటున్నారు. భారీ బహిరంగ సభలు నిర్వహిస్తారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ అభిమాని ఒకరు ఏర్పాటు చేసిన టీ స్టాల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. వరంగల్‌ జిల్లా ఖాజీపేటలో దీన్ని ఏర్పాటు చేశారు. 'రాహుల్‌ గాంధీ ఫ్యామిలీ టీ పాయింట్‌' పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ టీ స్టాల్‌ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

'టీ తాగితే మైండ్‌ ఫ్రెష్‌ అవుతుంది.. రాహుల్‌ గాంధీ వస్తే దేశం ఫ్రెష్‌ అవుతోంది' అంటూ తన టీ స్టాల్‌ కు ట్యాగ్‌ లైన్‌ ఇచ్చాడు. దీన్ని తెలుగు, ఇంగ్లిష్‌ భాషలో రాయడం విశేషం. అంతేకాకుండా 'ఓట్‌ ఫర్‌ రాహుల్‌ గాంధీ' అని కూడా దీనిపై పేర్కొన్నారు. దీన్ని ఎవరో సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌ గా మారింది.

మొత్తానికి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయా పార్టీలు, వాళ్ల అభిమానులు, సానుభూతిపరులు చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ప్రజలను ఆకర్షించడానికి, ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇలాంటి ఎత్తులు బాగానే పనిచేస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కాగా కాంగ్రెస్‌ కు పునర్వైభవం తేవడం, వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నింటికీ పెద్దన్న పాత్ర పోషించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన మొదటి విడత భారత్‌ జోడో యాత్ర విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలుపెట్టిన భారత జోడో యాత్ర వివిధ రాష్ట్రాల మీదుగా జమ్ము కశ్మర్‌ కు చేరుకుంది. జమ్ముకశ్మీర్‌ లో రాహుల్‌ గాంధీ భారత జోడో యాత్రను విరమించారు.

రాహుల్‌ 2022 సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభించిన 'భారత్‌ జోడో యాత్ర'.. మొత్తం 145 రోజులపాటు సాగింది. 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 75 జిల్లాల్లో మొత్తం 4,080 కిలోమీటర్ల మేర రాహుల్‌ నడిచారు.

కాగా దేశంలో దొంగల ఇంటి పేరు మోదీ అని ఉంటుందని రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్‌ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. మరోవైపు గుజరాత్‌ కోర్టు తీర్పుతో లోక్‌ సభ సభ్యత్వాన్ని రాహుల్‌ కోల్పోయారు. అయితే సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ఆయనపై అనర్హత వేటును ఎత్తేశారు. దీంతో తాజా లోక్‌ సభ సమావేశాలకు రాహుల్‌ హాజరయ్యారు.

Tags:    

Similar News