పార్లమెంట్ సమావేశాల వేళ రాహుల్ విదేశీ టూర్...ఎందుకలా...?

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇపుడు కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న రానున్నాయి.

Update: 2023-11-30 04:02 GMT

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇపుడు కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న రానున్నాయి. ఇందులో కాంగ్రెస్ కి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని అంతా అంటున్నారు. ఏది ఎలా ఉన్నా మెజారిటీ స్టేట్స్ ని కాంగ్రెస్ గెలుచుకుంటుంది అని అంచనా ఉంది. ఆ మరుసటి రోజే పార్లమెంట్ శీతాకాల సమావేశాలను కేంద్రం నిర్వహిస్తోంది.

ఇందులో ప్రాధాన్యత కలిగిన అనేక బిల్లులను ప్రవేశపెట్టడానికి బీజేపీ చూస్తోంది. ఇక ప్రస్తుత ప్రభుత్వానికి ఇవే పూర్తి స్థాయి పార్లమెంట్ సమావేశాలు అని కూడా అంటున్నారు.ఎందుకంటే ఈసారి బడ్జెట్ సెషన్ లో ఓటాన్ అకౌంట్ పెడతారు. దాంతో ఆ సమావేశాలలో కీలక బిల్లులు కానీ డిస్కషన్స్ కానీ ఉండవని అంటున్నారు.

ఏమి మాట్లాడాలన్నా ఎలా వ్యవహరించాలన్నా ఈ సమావేశాలే కీలకం. అందుకే బీజేపీ కూడా దాదాపుగా ఇరవై రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని చూస్తోంది. కామన్ సివిల్ కోడ్ తో పాటు బీజేపీ అమ్ముల పొదిలో ఉన్న అనేక బిల్లులకు చట్ట రూపం ఇవ్వాలని కూడా భావిస్తోందని ప్రచారంలో ఉంది.

ఇంతటి ప్రాధాన్యత కలిగిన పార్లమెంట్ సమావేశాలకు రాహుల్ హాజరు కారా అంటే ప్రచారంలో ఉన్న దాన్ని బట్టి చూస్తే రాహుల్ విదేశీ టూర్ చేయడానికి రెడీ అవుతున్నారు అని అంటున్నారు. నిజానికి అయిదు రాష్ట్రాలలో ఎక్కువ కాంగ్రెస్ గెలుచుకుంటే ఆ జోష్ వేరుగా ఉంటుంది. పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ పై చేయి సాధించడం ద్వారా అనేక అంశాలలో బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు కూడా వీలు ఉంటుంది.

రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ఈ విధంగా ఒక పవర్ ఫుల్ బాటను వేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ రాహుల్ ఇవన్నీ ఆలోచించినట్లుగా లేదు అని అంటున్నారు. అందుకే ఆయన డిసెంబర్ 9వ తేదీ నుంచి ఇండోనేషియా, సింగపూర్, మలేషియా, వియత్నాం దేశాల్లో పర్యటించబోతున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారంగా ఉంది. ఈ నెల 22 వరకూ పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. అయితే రాహుల్ ఈ సమావేశాలు పూర్తి అయ్యేంతవరకూ విదేశాలలోనే ఉండేలా షెడ్యూల్ ఉంది అంటున్నారు

ఇక రాహుల్ తన విదేశీ పర్యటనలో భాగంగా సింగపూర్, మలేషియాల్లో ఎన్ఆర్ఐలను, దౌత్యవేత్తలను కలుసుకుంటారని పార్టీ వర్గాల నుంచి తెలుస్తున్న విషయంగా ఉంది. అలాగే, వియత్నాంలో కమ్యూనిస్టు నాయకులతోనూ సమావేశం అవుతారని తెలిసింది. ఏది ఏమైనా రాహుల్ విదేశీ టూర్ ప్రోగ్రాం ని మార్చుకుని పార్లమెంట్ సెషన్ కి హాజరై ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీస్తే భావి ప్రధాని గా ఆయన ఇమేజ్ బాగా పెరుగుతుంది అని అంటున్నారు. మరి రాహుల్ విదేశీ టూర్ అయితే కన్ ఫర్మ్ అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News