రాజుల మధ్యే పోటీనా ?

టీడీపీ తరపున జగన్మోహన్ రాజు ప్రయత్నిస్తుంటే జనసేన తరపున శ్రీనివాసరాజు గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు.

Update: 2023-10-12 05:28 GMT

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాజంపేటలో రెండు పార్టీల నుండి క్షత్రియులు టికెట్ కోసం తీవ్ర స్థాయిలో పోటీపడుతున్నారు. పోయిన ఎన్నికల్లోనే టీడీపీ తరపున పోటీచేయటానికి జగన్మోహన్ రాజు గట్టి ప్రయత్నాలే చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో మిస్సయిపోయింది. అప్పటినుండి నియోజకవర్గంలోనే పార్టీ బలోపేతానికి కష్టపడుతూనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో సడెన్ గా జనసేన నుండి పోటీ మొదలైంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

రెండు పార్టీలు కలిస్తే ఎవరు పోటీ చేసినా గెలుపు గ్యారంటీ అనే ప్రచారం పెరిగిపోవడంతో రెండు పార్టీల తరఫున నేతల ప్రయత్నాల జోరు పెరిగిపోయింది. టీడీపీ తరపున జగన్మోహన్ రాజు ప్రయత్నిస్తుంటే జనసేన తరపున శ్రీనివాసరాజు గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. టీడీపీ తరపున మాజీ ఎంఎల్సీ చెంగల్రాయుడు కూడా రేసులో ఉన్నారు. ఇదే సమయంలో జనసేన నుండి శ్రీనివాసరాజు, అతికారి దినేష్ కూడా పోటీలో ఉన్నారు.

రెండు పార్టీల్లోని పరిస్ధితులను బేరీజు వేస్తే రాజుల మధ్య టికెట్ పోటీ బాగా ఉండేట్లుగా అర్ధమవుతోంది. రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గాల్లో రాజుల ప్రభావం బాగానే ఉంది. ఏ నియోజకవర్గంలో క్షత్రియులకు టికెట్ ఇచ్చినా దాని ప్రభావం మిగిలిన నియోజకవర్గాలపైనా పడుతుందనే ప్రచారం పెరిగిపోతోంది. అందుకనే ముఖ్యంగా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంపైనే రాజులు గురిపెట్టారు. ఇదే విషయాన్ని గతంలోనే చంద్రబాబునాయుడుతో జగన్మోహన్ రాజు భేటీ అయినపుడు గెలుపు అవకాశాలను వివరించారు. అయితే ఇప్పటి తాజా రాజకీయ పరిణామాల మధ్య ఈక్వేషన్లన్నీ మారిపోయే అవకాశాలు కనబడుతున్నాయి.

మారిపోతున్న పరిణామాలు ఎవరికి అడ్వాంటేజ్ గా మారుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. అయినా సరే రెండుపార్టీల తరపున క్షత్రియనేతలు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పై మూడు నియోజకవర్గాల పరిదిలో రాజుల ఓట్లకన్నా బలిజల ఓట్లు చాలా ఎక్కువ. కాబట్టి ఎప్పటినుండో అడుగుతున్నారని రాజులకే టికెట్లు ఇస్తారా ? లేకపోతే జనాభా దామాషా ప్రకారం బలిజలకు టికెట్లు ఇవ్వాలని అనుకుంటారా అన్నది సస్పెన్సుగా మారింది. ఏదేమైనా రాజులకే టికెట్లంటే ఏ రాజుకు అన్నది పాయింట్.

Tags:    

Similar News