అటు జగన్ ఇటు బాబు : రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు ఎవరికి....!?
దేవుళ్లకు పక్షపాతం లేదు. దేవీ దేవతలకు వివక్ష అంతకంటే లేదు. ఉంటే వారు దేవుళ్ళు ఎందుకు అవుతారు
దేవుళ్లకు పక్షపాతం లేదు. దేవీ దేవతలకు వివక్ష అంతకంటే లేదు. ఉంటే వారు దేవుళ్ళు ఎందుకు అవుతారు. ఇక రాజకీయాలు అన్నీ కూడా మనుషులకే తప్ప దేవుళ్లకు లేనే లేవు. ఇద్దరు భక్తులు ఒకేసారి దేవుళ్ళ వద్దకు వచ్చి మొక్కులు మొక్కితే ఎవరికి దీవిస్తారు, ఎవరికి ఆశీస్సులు ఇస్తారు అన్నది ఎపుడూ ఆసక్తికరమే. పౌరాణిక సినిమాలలో కూడా ఇలా పోటాపోటీ మొక్కులు యాగాలు వంటివి ఉన్నాయి.
ఆధునిక రాజకీయాల్లో ఆంధ్రాలో కూడా ఇపుడు అవే నడుస్తున్నాయి. ఏపీలో చూస్తే వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా ఉంది. జగన్ తో చంద్రబాబు వార్ దశాబ్దన్నర కొనసాగుతోంది. జగన్ చంద్రబాబు ఇద్దరూ ఇద్దరే. రాజకీయాలో వ్యూహాల్లో ఎవరి లెక్క వారిది. ఎవరి సత్తా వారిది.
ఇద్దరికీ సీఎం కుర్చీయే టార్గెట్. దానికి వదులుకోవడానికి పాయింట్ జీరో వన్ పర్సంట్ కూడా తగ్గేదు లేదు అంటున్నారు. ఇద్దరికీ పట్టుదల ఎక్కువే. ఇద్దరూ రాజకీయాలనే ఆశగా శ్వాసగా చేసుకున్న వారు. ఈ నేపధ్యంలో చూసుకుంటే మాత్రం ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోరు, అలాగే ఏ ఒక్క చాన్స్ ని కూడా ఉపయోగించుకోకుండా ఉండలేరు.
ఇలా ఎన్నికలలో ఎత్తులు పై ఎత్తులతో వెళ్తున్న ఈ ఇద్దరు నేతలు ఆధ్యాత్మికత విషయంలో కూడా కూడా పోటా పోటీగా ఉన్నారు. జగన్ 2019లో రాజశ్యామల అమ్మవారి యాగం చేసి అధికారంలోకి వచ్చారు అన్న ప్రచారం ఉంది. ఈసారికి చంద్రబాబు కూడా అదే పని చేసారు. ఆయన గత వారం తాను ఉండే ఉండవల్లి నివాసంలో మూడు రోజుల పాటు రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు.
ఇటు ముఖ్యమంత్రి జగన్ కూడా రాజశ్యామల అమ్మవారి దీవెనల కోసం తాడేపల్లి నుంచి విశాఖ వచ్చారు. ఆయన పెందుర్తిలోని శారదాపీఠానికి విచ్చేసి అక్కడ చాలా సేపు గడిపారు. రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పూర్ణాహుతి కార్యక్రమలో పాలు పంచుకున్నారు.
గత వారం రోజులుగా శారదాపీఠంలో వార్షికోత్సవాలు జరుగున్నాయి. ఇందులో భాగంగా రాజశ్యామల అమ్మవారి యాగం జరిగింది. పూర్ణాహుతికి జగన్ హాజరు కావడం విశేషం. ఏ యాగం అయినా హోమం అయినా పూర్ణహుతి చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. యాగ ఫలం దక్కాలంటే పూర్ణహుతిలో పాలుపంచుకోవాలి.
త్వరలో జరగనున్న ఏపీ ఎన్నికల్లో మరో మారు అధికారాన్ని ఆశిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజశ్యామల అమ్మ వారి దీవెనలు కోరుకుంటున్నారు. ఆ అమ్మ కరుణ ఉన్న వారిదే రాజ్యాధికారం అన్నది పురాణేతిహాసాలలోనే కాదు వర్తమానంలోనూ పలు సందర్భాలలో రుజువు అవుతూ వచ్చింది. రాజశ్యామల అమ్మవారి యాగం చేసి కేసీఅర్ రెండు సార్లు తెలంగాణాలో అధికారంలోకి వచ్చారు.
ఇక గత ఏడాది జరిగిన తెలంగాణా ఎన్నికలకు ముందు కేసీఆర్ రాజశ్యామల యాగం చేశారు. పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి కూడా చేశారు. అమ్మ కరుణ రేవంత్ రెడ్డి మీద ఈసారి ప్రసరించబడింది ఆయన సీఎం అయ్యారు అని చెబుతారు. ఇపుడు ఏపీలో చూస్తే ఎన్నడూ లేని విధంగా బాబు కూడా రాజశ్యామల యాగం చేశారు. ఆయన ఇలాంటి వాటికి సాధారణంగా దూరంగా ఉంటారు. తిరుపతి దేవుడు అంటే బాబుకు అపార నమ్మకం. అక్కడికే వెళ్తూంటారు. కానీ ఈసారి ఏ అవకాశం విడవకూడదు అని యాగం కూడా జరిపించేసారు.
జగన్ విషయం తీసుకుంటే ఆయన రాజగురువు శ్రీ స్వరూపానందేంద్ర స్వామీజీ ఆధ్వర్యంలో జరిగిన రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు. మరి ఈసారి జరిగే ఏపీ ఎన్నికల్లో ఎవరికి రాజశ్యామల అమ్మవారి దీవెనలు ఉంటాయి అన్నది మాత్రం ఆసక్తిని పెంచుతోంది. ఇద్దరూ భక్తిగానే అమ్మను కొలిచారు. మరి ఎవరికి రాజయోగం ఉంది. ఎవరి జాతకం ఎలా ఉంది అన్న దానిని బట్టి కూడా అధికార యోగం దక్కుతుంది అని అంటున్నారు ఆధ్యాత్మిక వేత్తలు.