ఎట్ హోం : తెలుగు రాష్ట్రాలలో అలా జరుగుతోంది...!
విభజన ఏపీలో రాజ్ భవన్ హైదరాద్ లో ఉన్నపుడు కానీ విడిగా ఉన్నపుడు కానీ విపక్ష నేత జగన్ ఎట్ హోం కి పెద్దగా వెళ్లేవారు కాదు.
ఎట్ హోం మంచి కార్యక్రమం. చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది. ఆగస్ట్ 15న సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ సీఎం సహా రాజకీయ ప్రముఖులను ఇతర ప్రముఖులను పిలిచి తేనీటి విందు ఇస్తారు. ఈ విధంగా గవర్నర్ అందరితో సమావేశం అవుతారు.
ఎట్ హోం కి ఆహ్వానం అంటే అదొక గౌరవంగా అంతా భావిస్తారు. అక్కడ రాజకీయాలకు అతీతంగా అంతా ఒక్కటిగా కనిపిస్తారు. ముచ్చటించుకుంటారు. గవర్నర్ సైతం అందరితో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏమి జరిగింది, జరుగుతోంది అన్నది తెలుసుకోవడానికి ఉపయోగపడే వేదికగా ఎట్ హోం ఉంటుంది.
విభజనకు ముందు ఉమ్మడి ఏపీలో ఎట్ హోం కి అంతా హాజరయ్యేవారు. సీఎం విపక్ష నేతల మధ్య చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ కనిపించేది. బయట ఎంతలా విమర్శలు చేసుకున్నా కూడా ఎట్ హోం వంటి చోట్ల కలసి మెలసి కబుర్లు చెప్పుకునేవారు. అలాంటి వాతావరణం కోసమే ఎట్ హోం వంటివి అని కూడా అనుకోవచ్చు.
అయితే విభజన తరువాత ఎట్ హోం కార్యక్రమాలు కళ కట్టడంలేదు. అధికార పక్షం నేతలు వస్తే విపక్ష నేతలు రావడంలేదు. విభజన ఏపీలో రాజ్ భవన్ హైదరాద్ లో ఉన్నపుడు కానీ విడిగా ఉన్నపుడు కానీ విపక్ష నేత జగన్ ఎట్ హోం కి పెద్దగా వెళ్లేవారు కాదు. ఒకేసారి ఆయన వెళ్ళినట్లుగా గుర్తు.
ఇక పవన్ కళ్యాణ్ కూడా ఉమ్మడి ఎపీకి గవర్నర్ గా నరసింహన్ ఉన్నపుడు ఒకసారి హైదరాబాద్ రాజ్ భవన్ కి వెళ్ళారు. జగన్ సీఎం అయ్యాక ఆయన రావడమే మానుకున్నారు. చంద్రబాబు అయితే ఒకసారి వచ్చినట్లుగా ఉంది. ఇలా ఏపీలో ఎట్ హోం కార్యక్రమాలకు విపక్షాలు పెద్దగా అటెండ్ కావడంలేదు.
ఏపీలో కొత్త గవర్నర్ గా ఉన్న అబ్దుల్ నజీర్ తొలిసారి గా ఎట్ హోం నీఅగస్ట్ 15న ఏర్పాటు చేస్తే సీఎం జగన్ మాత్రమే హాజరయ్యారు. అదే టైం లో మంగళగిరిలో జనసేన అధినేత పవన్ ఉన్నా వెళ్ళలేదు. చంద్రబాబు అయితే అదే సమయంలో విశాఖ బీచ్ లో పాదయాత్ర చేస్తున్నారు.
ఇక తెలంగాణాను తీసుకుంటే గత మూడేళ్ళుగా ఎట్ హోం కార్యక్రమానికి సీఎం కేసీయార్ హాజరు కావడంలేదు. దీని మీద రాజకీయంగా కూడా రచ్చ సాగుతోంది. తమాషా ఏంటి అంటే ఇక్కడ విపక్షాలు రాజ్ భవన్ కి అటెండ్ అవుతున్నాయి. అధికార పక్షం రావడంలేదు. అంటే పూర్తిగా ఏపీ ఎంట్ హోం కి వ్యతిరేకంగా అన్న మాట.
తెలంగాణ లో రాజ్ భవన్ కి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉందని ప్రచారంలో ఉన్న మాట. దాంతో సీఎం రావడం లేదని అంటున్నారు. దాంతో ఆయనతో పాటు ఆయన మంత్రులు కూడా రావడం లేదు. మొత్తానికి ఎట్ హోం ఒకప్పటిలా కళకళలాడడంలేదు. పైగా ఎట్ హోం అంటే అక్కడ ఏమి జరుగుతోంది, ఎవరు రావడం లేదు అన్న దాని మీద మీడియా ఫోకస్ పెట్టే పరిస్థితి ఉంది.