సంతానంలోనూ కుబేరుడే...ఎలాన్ మస్క్ కి 10మంది పిల్లలా?
అవును... కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తాజాగా బ్రిటన్ లో జరుగుతోన్న గ్లోబల్ ఏఐ సేఫ్టీ సమిట్ లో పాల్గొన్నారు
ఎలాన్ మస్క్... ప్రపంచస్థాయిలో ఏమాత్రం పరిచయం అవసరం లేని పేర్లలో ఒకటి! ప్రస్తుతం అత్యంత సంపాదనతో ప్రపంచ రిచ్చెస్ట్ పర్సన్ గా నిలిచిన మస్క్ కు మొత్తం ఎంతమంది పిల్లలు అనే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో... డబ్బులు సంపాదించే విషయంలోనే కాదు.. పిల్లలను పుట్టించే విషయంలోనూ మస్క్ దూకుడు ప్రదర్శిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకు కారణం లేకపోలేదు... శివోన్ జిలిస్, జస్టిన్ విల్సన్, గ్రిమ్స్ ల పిల్లల మొత్తం సంఖ్య షాకిస్తుంది మరి!
బ్రిటన్ లో జరుగుతోన్న అంతర్జాతీయ కృత్రిమ మేధ భద్రతా సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి రాజీవ్.. ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ తో ఫొటో దిగారు. అనంతరం ఎక్స్ వేదికగా దాన్ని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన ఒక కొత్త విషయంతో మస్క్ పిల్లల టాపిక్ తెరపైకి వచ్చింది. ఇంతకూ రాజీవ్ వెల్లడించిన అంశం ఏమిటంటే... మస్క్ కుమారుల్లో ఒకరి పేరులో "చంద్రశేఖర్" అని ఉండట!
అవును... కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తాజాగా బ్రిటన్ లో జరుగుతోన్న గ్లోబల్ ఏఐ సేఫ్టీ సమిట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేసిన ట్వీట్ లో... ఏఐ సదస్సులో భాగంగా తాను ఎవరిని కలిశానో చూడంటి అంటూ అగ్జయిట్ అయినట్లు స్పందించిన రాజీవ్... శివోన్ జిలి స్ (మస్క్ భాగస్వామి) తో కలిగిన కుమారుడి మధ్య పేరు "చంద్రశేఖర్"గా పెట్టినట్లు ఎలాన్ మస్క్ తనతో చెప్పారని తెలిపారు.
ఇదే సమయంలో... 1983లో నోబెల్ బహుమతి గెలుచుకున్న, భారత సంతతికి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ప్రొ.ఎస్.చంద్రశేఖర్ పేరిట ఆ పేరు పెట్టినట్లు తనకు తెలిపారని రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... కేంద్ర మంత్రి పేరులోనూ చంద్రశేఖర్ ఉండటం!
కాగా... తాను స్థాపించిన న్యూరాలింక్ కంపెనీలో పనిచేస్తున్న శివోన్ జిలిస్ తో కలిసి ఎలాన్ మస్క్ 2021 నవంబరులో కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. వారికి స్ట్రైడర్, అజూర్ గా పేరు పెట్టారు. ఇప్పటికే మస్క్ తన మాజీ భార్య జస్టిన్ విల్సన్ తో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చారు. ఇదే సమయంలో కెనడా గాయని గ్రిమ్స్ తో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. దీంతో మొత్తం మస్క్ సంతానం 10 మందిగా ఉందన్నమాట!
ఆ సంగతి అలా ఉంటే... బిజినెస్ పరంగా మస్క్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. గురువారం నాడు ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో తొలి 10 మందిలోనూ 9 మంది కుబేరుల సంపద భారీగా పెరగడం విశేషం. వీరందరిలో అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్ సంపద 9.14 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. అంటే... భారత కరెన్సీలో రూ.76 వేల కోట్లకుపైనే అన్నమాట. దీంతో ఈ ఒక్క సంవత్సరంలోనే ఎలాన్ మస్క్ సంపద 70.6 బిలియన్ డాలర్లకు పెరిగినట్లయ్యింది!