విడదల రజనీకి మరోసారి మార్పు తప్పదా?

అయితే... ఇదే కార్యక్రమం అధికార వైసీపీలో చికాకులకు కూడా కారణమవుతుందనే చర్చ నడుస్తుంది

Update: 2024-01-25 12:30 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ గతంలో ఎన్నడూ లేదన్నట్లుగా జగన్ తీసుకున్న అత్యంత కీలక, ఆసక్తికర నిర్ణయంగా ఇన్ ఛార్జ్ ల మార్పు అంశాన్ని చెప్పుకోవచ్చు. ఈ నిర్ణయం కేంద్రంగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలావరకూ మారుతున్నాయి. ఇంకా బలంగా చెప్పాలంటే... జగన్ ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పులు నిర్ణయం తీసుకున్న తర్వాతే ఏపీలో రసవత్తర రాజకీయ తెరపైకి వచ్చిందని చెప్పినా అతిశయోక్తి కాదు. కారణం... అది మొదలైన తర్వాతే జంపింగ్ లు వేగం పుంజుకున్నాయి!

అయితే... ఇదే కార్యక్రమం అధికార వైసీపీలో చికాకులకు కూడా కారణమవుతుందనే చర్చ నడుస్తుంది. జగన్ ఈ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాతే పలువురు నేతలు పార్టీని వీడి వెళ్తున్నారు. మరికొంతమంది అసంతృప్తిగా ఉన్నా సర్ధుకుపోతున్నారని తెలుస్తుంది. దీంతో... ఐదో జాబితాపై జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా మంత్రి విడతల రజినీకి సంబంధించి ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

ఇందులో భాగంగా... మరోసారి ఆమె సీటు మారుస్తారని.. ఆమెకు స్థాన చలనం ఉండొచ్చని చెబుతున్నారు. దీంతో... ఈ విషయం ఆసక్తిగా మారింది. అదేవిధంగా.. ఆమెను ఏ స్థానానికి పంపబోతున్నారనే చర్చ తదనుగుణంగా మొదలైంది. వాస్తవానికి గత ఎన్నికల్లో విడదల రజనీ చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావుపై 8,301 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

అయితే తాజాగా జరుగుతున్న ఇన్ ఛార్జ్ ల మార్పు వ్యవహారంలో భాగంగా ఆమెను గుంటూరు వెస్ట్ ఇన్ చార్జ్ గా మార్చారు జగన్. దీంతో అక్కడ ఆఫీసు ఏర్పాటుచేసుకున్న రజనీ... పనులు మొదలుపెట్టారు. అయితే... తాజాగా నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గుంటూరు ఎంపీగా పోటీచేయాలని కోరడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఐదో జాబితాలో నరసరావుపేట ఎంపీ సీటు కూడా చేరింది. దీంతో... ఆ ఎంపీ సీటులో మంత్రి విడదల రజినీని పోటీ చేయించే విషయంపై జగన్ సమాలోచనలు చేస్తున్నారని అంటున్నారు. ఈ స్థానంలో తొలుత వైసీపీ నేత నాగార్జున యాదవ్ అనుకున్నప్పటికీ... ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చనే సందేహంతో... ఆ బాధ్యత రజనీపై పెట్టేలా ఉన్నారని అంటున్నారు.

దీంతో జగన్ సెకండ్ థాట్ కి వెళ్తున్నారని.. అందులో భాగంగా రజనీని గుంటూరు పశ్చిమ సీటు నుంచి నరసరావుపేట ఎంపీ సీటుకి మార్చే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇదే జరిగితే మాత్రం... రెండు సార్లు మార్పులకు గురైన నేతగా రజనీ రికార్డ్ సృష్టిస్తారు.. వైసీపీ అంతర్గతంగా..!! అయితే... ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది!


Tags:    

Similar News