రాముడు కల్లోకొచ్చాడు.. అయోధ్యకు రానన్నాడు: బిహార్ మంత్రి వ్యాఖ్యలు
తాజాగా ఈయన అయోధ్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాజీ సీఎం, బిహార్ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, బిహార్ లో మంత్రిగా పనిచేస్తున్న తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ అనుకూల వాదులు, బీజేపీ అనుకూల వాదులు రామజపం చేస్తుండగా.. అయోధ్య జపం చేస్తుండగా.. ఎప్పుడెప్పుడు అయోధ్యకు వెళ్తామా? అని ఎదురు చూస్తుండగా.. ఈయన మాత్రం సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
తేజ్ ప్రతాప్ యాదవ్.. సాధారణంగానే భక్తుడు. ఈయన నిత్యం పూజలు చేసుకున్నాకే ఇంటి నుంచి బయట కు వస్తారు. రామ భక్తుడనే పేరు కూడా ఉంది. తాజాగా ఈయన అయోధ్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. `` రాముడు నా కలలోకి వచ్చాడు. నన్ను పరామర్శించాడు. అయోధ్యకు వస్తు్నావా? రామా? అని ప్రశ్నించా. కానీ, ఆయన రానన్నాడు. తనకు ఇష్టం లేదని అన్నాడు. ఎన్నికల కోసమే బీజేపీ రామ మందిరం నిర్మించిందని తెలిపాడు`` అని తేజ్ ప్రతాప్ వ్యాఖ్యానించారు.
ఈ నెల 22న అయోధ్యలోని రామజన్మ భూమిలో రామ్ లల్లా(బాలరాముడు) విగ్రహాన్ని ప్రతిష్టించాలని మోడీ సర్కారు నిర్ణయింది. వాస్తవానికి నాలుగు దశల్లో నిర్మించాల్సిన ఈ మందిరం తొలి దశలో 75 శాతం మాత్రమే పూర్తి అవుతోంది. దీనిని అందరూ తప్పుబడుతున్నారు. ముఖ్యంగా మఠాధిపతులు తీవ్రస్తాయిలో వ్యతిరేకిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఆలయంలో ప్రతిష్టలేల అని నిరసిస్తున్నారు. తాము రాబోమని తేల్చి చెప్పారు.
ఇక, ఈ క్రమంలోనే తేజ్ ప్రతాప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తనకు రాముడు కల్లో కనిపించాడని.. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తాను హాజరు కాబోనని చెప్పాడని పేర్కొన్నారు. కేవలం తనకు మాత్రమే కాకుండా.. రాముడు నలుగురు శంకరాచార్యుల కలలోకి వచ్చాడని తెలిపారు. మందిర వెనుక కపటత్వం ఉందని.. అందుకే తాను రావడం లేదని రాముడు చెప్పినట్లు తేజ్ ప్రతాప్ యాదవ్ వెల్లడించడం గమనార్హం. కాగా.. లాలూ కుటుంబం.. మోడీని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.