సుప్రీం ఆగ్రహించిన వేళ.. రామ్ దేవ్ బాబా కీలక వ్యాఖ్యలు
ఆధునిక వైద్య విధానాన్ని.. అల్లోపతి మందులను టార్గెట్ చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలు చేస్తున్నారంటూ పతంజలి సంస్థపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే
యోగా గురువుగా సుపరిచితులు.. తర్వాతి కాలంలో దేశంలోనే అతి పెద్ద సంస్థల్లో ఒకటిగా తన పతంజలి కంపెనీని మార్చిన రాందేవ్ బాబా తాజాగా రియాక్టు అయ్యారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రాందేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థ ప్రకటనలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. వారికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన వేళ ఆయన స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. అసలేం జరిగిందంటే..
ఆధునిక వైద్య విధానాన్ని.. అల్లోపతి మందులను టార్గెట్ చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలు చేస్తున్నారంటూ పతంజలి సంస్థపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే. అంతేకాదు.. అల్లోపతి ఔషధాలకు వ్యతిరేకంగా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటలనను నిలిపివేయాలని సుప్రీం ఆదేశాలు జారీ చేస్తూ.. ‘‘ఇలాంటి ఉల్లంఘనను కోర్టు తీవ్రంగా పరిగణిస్తుంది. ప్రతి తప్పుడు క్లెయింకు గరిష్ఠంగా రూ.కోటి వరకు ఫైన్ తప్పదు’’ అంటూ హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో రోజు తర్వాత స్పందించిన రాందేవ్ బాబా నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు రావటమే కాదు.. సవాలు తరహా వ్యాఖ్యలు చేశారు.
అల్లోపతికి చెందిన డాక్టర్ల ముఠా తన కంపెనీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని మండిపడిన రాందేవ్ బాబా.. ‘‘యోగా.. ఆయుర్వేదం.. ప్రక్రతి వైద్యం.. సనాతన విలువలకు వ్యతిరేకంగా కొందరు వైద్యులతో కూడిన టీం ప్రచారం చేస్తోంది. రక్తపోటు.. మధుమేహం.. ఆస్తమా.. కీళ్ల నొప్పులు.. కాలేయ వ్యాధి.. మూత్రపిండాల సమస్యలకు పరిష్కారం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పతంజలి మందులతో వ్యాధులు నయం అయ్యాయని శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. యోగా.. ఆయుర్వేదం.. ప్రక్రతి వైద్యంతో మధుమేహం.. థైరాయిడ్ సమస్యలు.. అధిక రక్తపోటు.. ఉబకాయం లాంటి ఎన్నో వ్యాధుల్ని నయం చేస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు.
తాను సుప్రీం కోర్టు.. దేశ చట్టాల్ని.. రాజ్యాంగాన్ని గౌరవిస్తామని.. తాము నిజంగానే తప్పుగా ప్రచారం చేస్తే తమకు జరిమానా విధించాలన్నారు. వైద్యుల టీం అన్నట్లుగా తాము నిరాధార ఆరోపణలు చేసినట్లుగా నిరూపిస్తే చావటానికైనా సిద్ధమని.. తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. శతాబ్దాలుగా ఉన్న యోగా.. నేచురోపతి.. ఆయుర్వేద వైద్యాలపై గత ఐదేళ్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ‘‘శాస్త్రీయ పరిశోధనలు.. ప్రీ.. పోస్ట్ క్లినికల్ ట్రయల్స్.. ప్రోటోకాల్ లను కలుపుకొని పతంజలి 500 అధ్యయనాలు నిర్వహించింది’’ అని పేర్కొన్నారు. రాందేవ్ బాబా మాటలు బాగానే ఉన్నా.. తన మాటలకు బలాన్నిచేకూర్చేలా తాము నిర్వహించిన అధ్యయనాల్ని..శాస్త్రీయ వాస్తవాల్ని బయటకు వెల్లడించి.. ప్రజలకు అవగాహన కల్పిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.