నారా బ్రాహ్మణికి ఆర్జీవి విద్యుత్ శక్తి పాఠాలు!

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే

Update: 2023-09-30 07:09 GMT

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. ఆయన అరెస్టై ఇవాల్టికి 21వ రోజు! స్కిల్ స్కాం కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించి జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. ఈ సమయంలో బాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ వినూత్న కార్యక్రమాలు చేపడుతుంది.

ఇందులో భాగంగా నీటిలో దిగి నల్ల జెండాలు చూపించడం, టెంటులేసుకుని "ఐయాం విత్ బాబు" అనే ఫ్లకార్డులు చేతపట్టి నిరసన తెలపడం, కార్ల ర్యాలీలు చేపట్టడం, మరికొంతమంది ఇంట్లోనే నిరాహార దీక్షకు కూర్చోవడం తెలిసిందే. ఈ సమయంలో ఒక వినూత్న ఆలోచన అంటూ నారా బ్రాహ్మణి టీడీపీ శ్రేణులకు ఒక పిలుపు ఇచ్చారు. ఇదే సమయంలో ఆ పిలుపుపై నారా లోకేష్ ట్వీట్ చేశారు.

అవును... చంద్రబాబు అరెస్టుకు నిరసనగా "మోత మోగిద్దాం" కార్యక్రమాన్ని నిర్వహించనుంది టీడీపీ. ఇందులో భాగంగా... చంద్రబాబుకు మద్దతు తెలియజేస్తూ ఈ సాయంత్రం రాత్రి 7 నుంచి 7:05 నిమిషాల వరకు ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి గంటలు మోగించాలని, పళ్లెం తీసుకుని గరిటెతో కొట్టాలని, విజిల్స్ చేయాలని, ప్రయాణంలో ఉంటే హారన్ మోగించాలని, ఆ విధంగా చేస్తూ చంద్రబాబుకు మద్దతు తెలపాలని బ్రాహ్మణి విజ్ఞప్తి చేశారు!

ఇదే విషయాన్ని ట్విట్టర్ లో ప్రస్థావించిన బ్రాహ్మణి, లోకేష్ లు... "అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గమని నిరూపిద్దాం. నిలువెత్తు నిజాయితీ రూపం, తెలుగుతేజం చంద్రబాబుకి మద్దతుగా తెలుగువారంతా ఉన్నారని నిరూపించే తరుణం ఇది. నిష్కళంక రాజకీయ మేరునగధీరుడు చంద్రబాబుకి మద్దతుగా 30వ తేదీ శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాలకు ఉన్న చోటే మోత మోగించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాశబ్ధం వినిపిద్దాం" అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో... తాజాగా బ్రాహ్మణి ట్వీట్ పై దర్శకుడు రాం గోపాల్ వర్మ స్పందించారు. ఇందులో భాగంగా "బ్రాహ్మణి గారూ.. మీరు ఒక వర్ధమాన రాజకీయవేత్త. మీకు నేనిచ్చే చిన్న సలహా ఏమిటంటే.. ప్రజలపై తాను ఎంత వరకు ప్రభావం చూపగలను అనే అంశాన్ని పరీక్షించుకోవడానికి ఇలాంటి ప్రమాదకర ప్రయత్నాలు చేయవద్దు.." అని ట్వీట్ చేశారు ఆర్జీవీ!

ఇదే సమయంలో... "మోత మోగించాలనే మీ సూచనలను ప్రజలు ఎవరూ పట్టించుకోకపోతే... మీ రాజకీయ జీవితం షార్ట్ సర్క్యూట్‌ కు గురవుతుంది.." అంటూ సూచించిన ఆర్జీవీ... "ఎలక్ట్రిసిటీ కాంతివంతంగా ఉండాలే తప్ప ఎప్పుడూ కనెక్ట్ కాకూడదు" అని అయాన్ రాండ్ అన్నారంటూ చెప్పుకొచ్చారు. ఇంత చెప్పిన ఆర్జీవీ... చివర్లో నోట్ అంటూ... "సలహాదారుల మాట అస్సలు వినొద్దు" అని సూచించడం గమనార్హం!

Tags:    

Similar News